● భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్
భువనేశ్వర్: శాసీ్త్రయ వైజ్ఞానిక సామర్థ్యం ఐచ్ఛికం కాదు, వికసిత భారత్‌కు పునాది అని భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్ ప్రబోధించారు. ప్రపంచంలో వేగవంతమైన మార్పులకు విజ్ఞాన శాస్త్రం విధానాలకు మార్గ నిర్దేశం చేసి సుస్థిరతను నిర్ధారించాలని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక జాతీయ విజ్ఞాన విద్య, పరిశోధన సంస్థ నైజర్ 15వ స్నాతకోత్సవంలో ఉత్తీర్ణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
శాసీ్త్రయ విజ్ఞానం, ఆవిష్కరణ, మేధో నాయకత్వంలో భారత దేశ ఆకాంక్షలకు నైజర్ ప్రతీకగా నిలుస్తుందని ఉప రాష్ట్రపతి అన్నారు. బలమైన పునాదితో ప్రాథమిక వైజ్ఞానిక శాస్త్రాలలో కొత్త తరాలకు మార్గ దర్శకంగా నిలవడంలో నైజర్ భారత దేశపు దీర్ఘకాలిక నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు.
డాక్టర్ హోమీ భాభాకు నివాళులర్పిస్తూ.. ఆయన మరణం భారత దేశ అణు పరిశోధనకు ఒక పెద్ద ఎదురు దెబ్బ అని ఉప రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. ఆ విషాదం నుంచి భారత దేశం మరింత బలంగా పుంజుకుని నేడు అణు పరిశోధనలో ప్రపంచంలోని అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. పట్టభద్రులైన విద్యార్థులపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉత్తీర్ణుల్లో చాలా మంది భవిష్యత్‌లో డాక్టర్ హోమీ బాబాలుగా ఎదిగి భారత దేశ శాసీ్త్రయ, సాంకేతిక పురోగతికి గణనీయమైన కృషి చేస్తారని భారత ఉప రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. స్నాతకోత్సవం పురస్కరించుకుని కేవలం విద్యా అర్హత పత్రాన్ని మాత్రమే పొందడం లేదు. మీ భుజాలపై సమాజం పట్ల ఒక పెద్ద బాధ్యతను మోసేందుకు సన్నద్ధతని అంగీకారబద్ధంగా స్వీకరించారని తెలిపారు. ప్రపంచంలోని అన్ని సమస్యలకు పరిష్కారం కేవలం విజ్ఞాన శాస్త్రం ద్వారా మాత్రమే సాధ్యమని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేసి ఉత్తీర్ణులను ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పట్టభద్రులుగా ఉత్తీర్ణత సాధించిన యువత విజ్ఞాన శాస్త్రం, పరిశోధన, దేశ నిర్మాణ ప్రక్రియకు విశేష కృషి చేయాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక రంగాల పురోగతి ఒక సంపన్న దేశానికి పునాది. భారతీయ యువ పరిశోధకులు, పట్టభద్రులు ఉత్తీర్ణతతో సాధించిన డిగ్రీల ప్రతిఫలాన్ని దేశాభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి భారత ఉప రాష్ట్రపతితో రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అణుశక్తి శాఖ కార్యదర్శి డాక్టర్ అజిత్ కుమార్ మహంతి, నైజర్ డైరెక్టర్ ప్రొఫెసర్ హిరేంద్రనాథ్ ఘోష్ హాజరయ్యారు.


