పర్లాకిమిడి: తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా కార్యకర్తలు కోరుతున్నారు. ఈ మేరకు ఒడిశా రాష్ట్ర ఆశా వర్కర్ల సంఘం గజపతి జిల్లాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గురువారం ఆందోళన చేపట్టారు. వీరికి భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు సుజిత్ ప్రధాన్ మద్దతు పలికారు. ఆశా వర్కర్లకు వేతనం రూ.18 వేలకు పెంచాలని, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సామాజిక సురక్ష సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రతినెనా 10వ తేదీ నాటికి వేతనాలు జమ చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మృత్యువాతపడిన ఆశాలకు రూ.10 లక్షల నష్టపరిహారం, గాయపడినవారికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరారు. అనంతరం ఏడీఎం ఫల్గునీ మాఝికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు సీహెచ్ ఉష, కార్యదర్శి సమాఖ్య గోమాంగో పాల్గొన్నారు.
రోడ్డెక్కిన ఆశ కార్యకర్తలు
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లాలో గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఉద్యోగాలను శాశ్వతం చేయడం, ప్రస్తుతం నెలకు అందుతున్న రూ.7 వేల పారితోషికాన్ని రూ.26వేలకు పెంచడం, సామాజిక భద్రత, పెన్షన్, బీమా సౌకర్యాలు కల్పించడం వంటి డిమాండ్లను ప్రస్తావించారు. అనంతరం కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్‌కు వినతి పత్రం అందజేశారు.
ఆశ కార్యకర్తకు బహిష్కరణ బెదిరింపులు
పర్లాకిమిడి: మతం పేరుతో ఒక ఆశ కార్యకర్తను ఒక మైనార్టీ సంఘం నుంచి బహిష్కరిస్తామని బెదిరించిన సంఘటన గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ జిరంగో గ్రామంలో వెలుగుచూసింది. బాఽధితురాలు ఎస్పీ కార్యాలయం వద్ద తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయఘడ సమితి జిరంగో గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త సునందినీ మిశాల్ ఆ గ్రామంలో ఉన్న ఒక మతానికి చెందిన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి సేవలు అందించారు. ఆమె సొంత మైనార్టీ సంఘం (క్రిష్టియన్) సొసైటీ సభ్యులు ఆమెకు రూ.5వేల జరిమానా విధించటంతో పాటు సంఘం నుంచి బహిష్కరించారు. కొద్దిరోజుల కిందట జిరంగో గ్రామ మత సొసైటీ ఒక నియమం పెట్టింది. అయితే గత నెల 12 వతేదీని గ్రామంలో వేరే వర్గానికి చెందిన వారి కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు రావడంతో వారికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇచ్చి వారికి తగు సలహా ఇచ్చింది. అలాగే ప్రభుత్వం ఆదేశించిన జనగణన నివేదిక సేకరించడానికి వెళ్లడంతో సంఘం నేతలు ఆమెకు జరిమానా విధించటమే కాకుండా గ్రామ బహిష్కరణ విధిస్తామని హెచ్చరించారు. దీంతో ఆశ వర్కరు సునందినీ ఆందోళన వ్యక్తం చేసి రాయగడ పోలీసు స్టేషన్‌కు ఒక కంప్‌లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఆమె ఫిర్యాదును తీసుకోలేదు. దీంతో ఆమె జిల్లా ముఖ్యవైధ్యాధికారి, జిల్లా ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయాలని విన్నవించింది.
అయితే జిరంగో మైనారిటీ సంఘం నేతలు గురువారం పర్లాకిమిడి విచ్చేసి ఆశావర్కరు సునందినీ మిశాల్ చెప్పిందంతో బూటకమని ఆమె మాటలు నమ్మవద్దని జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనాకు ఒక మెమొరాండమ్ అందజేశారు. అనంతరం స్థానిక రోడ్లు–భవనాల శాఖ బంగళా వద్ద జిరంగో మైనార్టీ సంఘం విలేకరులతో సమావేశమై ఆశావర్కరు సునందినీ కులసంఘంపై వ్యతిరేకంగా ఇచ్చిన నివేదిక తప్పు అని వివరణ ఇచ్చారు.


