భువనేశ్వర్: హిరాకుద్ జలాశయం నుంచి ఈ సీజను తొలి విడత వరద నీటిని గురువారం విడుదల చేశారు. ప్రస్తుతం హిరాకుద్ జలాశయం నీటి మట్టం 611.23 అడుగులుగా ఉంది. తొలుత ఉదయం 4 గేట్లు తెరిచి వరద నీటిని విడుదల చేశారు. తదుపరి మద్యాహ్నం వేళలో మరో 6 గేట్లు ద్వారా లోతట్టు ప్రాంతాలకు వరద నీటిని విడుదల చేశారు. ఇలా తొలి రోజున మొత్తం 10 గేట్లు తెరిచి వరద నీటిని విడుదల చేశారు. తొలి విడత కింద 4 గేట్ల ద్వారా 94 వేల క్యూసెక్కులు, మలి విడత కింద 6 గేట్లు తెరిచి 1 లక్ష 89 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. విడులైన వరద నీరు 48 గంటల్లో దిగువ ప్రాంతంలో ముండలి జలాశయానికి చేరుతుందని అధికారులు తెలిపారు. హిరాకుడ్ జలాశయం 47 గేట్ల ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయని జల వనరుల శాఖ ఉన్నత ఇంజనీర్ దిలీప్ రౌత్ తెలిపారు. జలాశయంలో నీటి మట్టం నిర్వహణ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు వరద నీటిని విడుదల చేయడం సాధారణ ప్రక్రియగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు.


