జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ ఆగ్రహం
కొరాపుట్: జాతీయ రహదారి విభాగ అధికారులు తక్షణమే సెలవులపై వెళ్లిపోవాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని డీఎన్‌కే సమావేశ మందిరంలో గురువారం జరిగిన జిల్లా ప్రణాళిక సంఘం సమావేశం వద్ద మీడియాతో మాట్లాడారు. సునాబెడా–కొరాపుట్ జాతీయ రహదారి పరమ అధ్వానంగా మారిందన్నారు. ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రోడ్డుకు కనీస మరమ్మతులు చేయాలనే ఆలోచన రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పనులు చేయని అధికారులు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. ప్రజల చేత తాము విమర్శలు పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి చెందిన కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో నేతృత్వంలో ప్రణాళిక సంఘం సమావేఽశం జరిగింది. సమావేశంలో కలెక్టర్ సత్యవాన్ మహాజన్, ఎమ్మెల్యేలు పవిత్ర శాంత, రుపుధర్ బోత్ర, జెడ్పీ చైర్‌పర్సన్ సస్మిత మెలక తదితరులు పాల్గొన్నారు.


