జయపురం: ప్రపంచ ప్రసిద్ధ ఘోషయాత్ర(రథయాత్ర) కోసం జయపురంలో జగన్నాథ్, బలబధ్ర, సుభద్రల కోసం నిర్మాణాధీనంలో ఉన్న రథాల నిర్మాణ పనులను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి గురువారం పర్యవేక్షించారు. దేవాదాయ అధికారి, జయపురం తహసీల్దార్ సబ్యసాచి జెన, దేవాదాయ ధర్మాదాయ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర బాహిణీపతి, కమిటీ సభ్యులు డాక్టర్ పరేష్ రథ్‌లతో రథాలు నిర్మాణం జరుగుతున్న శ్రీరఘునాథ్ మందిర కూడలి వద్దకు వచ్చి రథాల నిర్మాణ పనులు పరిశీలించారు. రథాలు చేస్తున్న వడ్రంగి టీమ్‌తో పనుల పురోగతిపై చర్చించారు. రథ యాత్రకు ఇంకా కొద్ది దినాలే సమయం ఉండటం వలన యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని సూచించారు.
మొక్కలతో పర్యావరణ పరిరక్షణ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి సెరపల్లి పంచాయతీలో గల లక్ష్మణ్ వీర హైస్కూల్‌లో గురువారం ఔషధ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజన్ పాణిగ్రాహి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి వివిధ రాకాల మొక్కలు నాటి, మొక్కల అవసరాల గూర్చి వివరించారు. పర్యావరణం సమతుల్యతను కాపాడాలన్నారు. జిల్లా శారీరక వైద్యాధికారి కార్తీక్ చంద్ర బెహరా, జూనియర్ రెడ్‌క్రాస్ అధికారి నిరంజన్ మహరాణా, తదితరులు పాల్గొన్నారు.
దేశ సేవలో యువత భాగస్వామ్యం కావాలి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా యంత్రాంగం విస్తృత అవగహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత్ వైమానిక దళంలో జిల్లా యువత భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు అగ్నివీర్ వాయు నియామకాల కోసం జరుగుతున్న ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను జిల్లా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు చేరవేయాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ షర్వింద్ రాజశిర్కే అధ్యక్షతన జిల్లా స్థాయి వర్చువల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని జిల్లా నైపుణ్యభివృద్ధి, ఉపాధి అధికారి గుప్త మాడి నిర్వహించారు. జిల్లాలోని అన్ని డిగ్రీ కళాశాలలు, ఐటీఐలు, పాలిటెక్నిక్ సంస్థల ప్రిన్సిపాళ్లు, అధికార్లు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడూతూ జిల్లాలోని ప్రతి విద్యా సంస్థకు చెందిన విద్యార్థులు భారత వైమానిక దళంలో సేవ చేయడం కోసం ప్రోత్సహించాలన్నారు. ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తిచేయ్యాలన్నారు.
కొత్తూరు: కొత్తూరు రాజవీధికి చెందిన లోతుగెడ్డ ధనుంజయ్ ఇంట్లో ఈ నెల మూడో తేదీ రాత్రి జరిగిన దోపిడీ కేసులో నిందితులను గురువారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ కె.వెంకటేష్ తెలిపారు. వీరిలో కొత్తూరుకు చెందిన సొంట్యాన నవీన్(దాస్), టొంపల వినయ్‌కుమార్, సిరువాడ గ్రామానికి చెందిన కొన్న తరుణ్, ఎల్‌ఎన్‌పేట మండలం గొట్టిపల్లి గ్రామానికి చెందిన కురమాన శ్రీనివాసరావులకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారని చెప్పారు. నలుగురు నిందితులను జిల్లా జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.


