రాయగడ: సదరు సమితి సమావేశం హాల్‌లో సోమవారం పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ప్లాన్–జిపిడిసి) రూపకల్పనపై ఒక్కరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడం, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాన్ని బీడీఓ సుజిత్ కుమార్ మిశ్ర ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. సమితి వైస్ చైర్మన్ హర ప్రసాద్, జీపీడీఓ సృతిరేఖ నాయక్, పేసా సమన్వయకర్త యోగేంద్ర నాయక్, సీనియర్ ఉపాధ్యాయుడు నీలాంచల్ మిశ్రా, తదితరులు హాజరయ్యారు. సదరు సమితి పరిధిలో గల పితామహాల్, కొత్తపేట, కుముటిలపేట, కొంధొ మల్లిగాం గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, కార్డు సభ్యులు, కార్యనిర్వాహక అధికారులు, జిఆర్‌ఎస్‌లు, విద్య, ఆరోగ్యం, సరఫరా, జీవిక మిషన్ తదితర శాఖలకు చెందిన అధికారులు ప్రతినిధులు శిక్షణలో పాల్గొన్నారు. వికసిత ఒడిశా లక్ష్య సాధనలో భాగంగా గ్రామ పంచాయతీ నుంచే శాశ్వత అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని, 16వ ఆర్థిక సంఘం నిధులను అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయాలని బీడీఓ వివరించారు. వివిధ శాఖల అభివృద్ధి పథకాలు, అమలు విధానాలపై చర్చించారు.


