● వడగాలులు ముంచుకొస్తున్నాయి
● కలెక్టర్లకు ఎస్‌ఆర్‌సీ హెచ్చరిక జారీ
భువనేశ్వర్: రాష్ట్రంలో వేసవి తాపం ఉగ్ర రూపం దాల్చనుంది. గత కొద్ది రోజులుగా అకాల వర్షాలు కాల వైశాఖి ప్రభావంతో ఉపశమనం కలిగించిన వాతావరణం వేడెక్కనుంది. వడగళ్ల వానతో అతలాకుతలమైన ప్రజానీకానికి వడగాడ్పులు బెంబేలెత్తించనున్నాయి. స్వీయ అప్రమత్తతతో వడ దెబ్బ వంటి ప్రాణాంతక చర్యల నుంచి రక్షణ పొందాలని వాతావరణ విభాగం సూచన మేరకు రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనరు (ఎస్‌ఆర్‌సీ) కార్యాలయం పలు జాగ్రత్తలు జారీ చేసింది. ఈ నెల 11 నుంచి 16 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందస్తు సమాచారం జారీ చేసింది. ఈ నెల 13, 14 తేదీలలో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలతో అనుబంధ విభాగాలు, శాఖలు అప్రమత్తం కావాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈ పరిస్థితుల దష్ట్యా పలు ప్రాంతాలకు పసుపు హెచ్చరిక జారీ చేసి సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్‌ఆర్సీ) రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు.
రెవెన్యూ, విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరులు, గృహ నిర్మాణం, పట్టణ అభివృద్ధి, విద్యుత్, తాగు నీరు, పంచాయతీ రాజ్, మత్స్య, ఆరోగ్యం, విద్య, కార్మిక తదితర విభాగాల వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకు, ఆర్‌డీసీలు, ఓఎస్‌డిఎంఏ, మున్సిపల్ కార్య నిర్వాహక డైరెక్టర్‌కు ఈ లేఖ జారీ చేశారు. వడగాడ్పుల పరిస్థితి పట్ల అనుక్షణం పర్యవేక్షించాలని ఎస్‌ఆర్‌సీ ఆదేశించింది. ఉత్తర కోస్తా ఒడిశాలో ఒకటి రెండు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత ఇప్పటికే సుమారు 3 డిగ్రీల సెల్సియస్ మేర గణనీయంగా పెరిగింది. బౌధ్‌లో అత్యధికంగా పగటి పూట ఉష్ణోగ్రత 38.9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా ఝార్సుగుడలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 18.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. శిశువులు, వృద్ధులు, గర్భిణీ సీ్త్రలు, అనారోగ్య పీడితులు ఉన్నవారు వంటి బలహీన వర్గాల వారికి ఈ వాతావరణం స్వల్ప ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు.
రైతులకు సూచన
చెరుకు, వేసవి మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, కూరగాయల పంటలకు నిరంతర నీటి పారుదల కొనసాగించాలని రైతులకు సూచించారు. పెంపుడు జంతువులు, పశువులను చల్లని, నీడ ఉన్న ప్రదేశాలలో తగినంత తాగు నీటితో ఉంచాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల సమయంలో సంబంధిత శాఖలన్నీ అప్రమత్తంగా ఉండి ప్రజల భద్రతను నిర్ధారించాలని ఎస్‌ఆర్సీ నొక్కి చెప్పింది.
ఐఎండీ పసుపు హెచ్చరిక
బాలాసోర్, భద్రక్, కేంద్రాపడా, జగత్‌సింగ్‌పూర్, కటక్, జాజ్‌పూర్, పూరీ, ఖుర్దా, నయాగఢ్, గజపతి, గంజాం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల వేడి మరియు తేమతో కూడిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
రేపటి వాతావరణం
బొలంగీర్, బర్‌గడ్, సంబల్ పూర్ జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల వడగాడ్పుల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. తీర ప్రాంత, దక్షిణ జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల వేడి, తేమతో కూడిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
శరీరంలో నీటి శాతం చూసుకోవాలి
రద్దీ సమయాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు బయటకు వెళ్లేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలు పాటించడం అవసరం. ఎక్కువసేపు ఎండలో ఉండకుండా, లేత రంగు, వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించి, టోపీ, గొడుగు లేదా తడి గుడ్డతో తలను కప్పుకోవాలి. దాహం వేయకపోయినా తగినంత నీరు తాగాలి. శరీరంలో నీటి శాతం తగ్గుదల (డీహైడ్రేషన్) నివారణకు ఓఆర్‌ఎస్, లస్సీ, తరవాణి (పుల్లటి గంజి), చెరకు రసం, నిమ్మ రసం, మజ్జిగ వంటివి వాడాలని సిఫార్సు చేశారు. మద్యం, టీ, కాఫీ, కార్బోనేటెడ్ పానీయాలు, అధిక ప్రోటీన్ లేదా నిల్వ ఉన్న ఆహారానికి దూరంగా ఉండటం శ్రేయోదాయకం. శ్రమతో కూడిన బహిరంగ పనులను రోజులో చల్లగా ఉండే సమయాల్లో తరచుగా విశ్రాంతి తీసుకుంటూ ఉండేలా షెడ్యూల్ చేసుకోవాలి. కార్మికులు, ముఖ్యంగా గర్భిణులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తల తిరగడం, తల నొప్పి, వికారం, నీరసం లేదా మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.


