● కారుబాయి గ్రామస్తుల ఉద్యమం
● మద్యనిషేధమే ధ్యేయమంటున్న ప్రజలు
రాయగడ: సదరు సమితి కారుబాయి గ్రామంలో మద్యవ్యతిరేక ఆందోళనకు గ్రామస్తులు నడుం బిగించారు. గ్రామ శివారులో నాటుసారా తయారీ, విక్రయాలు ఊపందుకోవడంతో యువత మత్తుకు బానిసై వారి భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. దీంతో తమ కుటుంబాలు గమ్యం లేని జీవితాలుగా మిగిలిపోతున్నాయని భావించిన గ్రామస్తులు అంతా ఏకమై గ్రామంలో సారా, మద్యానికి వ్యతిరేకంగా ఆందోళనకు శ్రీకారం చుట్టారు. దీంతో పక్కనే ఉన్న పనొగుడ గ్రామస్తులు కూడా అందుకు సై అంటూ ఆందోళనకు ఊపిరి పొసింది. దీంతో ఆయా గ్రామాలకు చెందిన పురుషులు, మహిళలు గ్రామ శివారల్లో ఉన్న నదీ తీర ప్రాంతాల్లో అక్రమంగా తయారు చేస్తున్న నాటుసారా కేంద్రాలపై ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. సారా తయారీ కేంద్రాల్లో ఉన్న సామగ్రీలను, పొదల్లో దాచిఉంచిన ఊటను బయటకు తీసి మహిళలు ధ్వంసం చేశారు. గ్రామస్తులకు అండగా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు మద్దతు ఇస్తున్నారు. వారంతా గ్రామాల్లో తిరిగి మధ్య నిషేధం గురించి అవగాహన కల్పిస్తున్నారు. తమ ప్రాంతంలో సంపూర్ణ మద్య నిషేధమే ధ్యేయంగా తాము చేపట్టిన ఈ ఆందోళన విజయవంతమయ్యేంత నిద్రపోమని శపథం చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో అక్రమంగా నాటుసారా తయారీ, విదేశీ మద్యం అమ్మకాలకు బ్రేక్ పడింది. ఎవరైన మద్యం విక్రయాలు, తయారీకి ఒడిగడితే తాము ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు. ఏదిఏమైనప్పటికీ వీరి ఆందోళనకు అంతా మద్దతు పలకడంతో ఆయా గ్రామాల్లో సంపూర్ణ మద్యనిషేధానికి బీజం పడిందని భావిస్తున్నారు. ఆందోళనకు కారుబాయి పంచాయతీ సర్పంచ్ మరియా శిరిక నాయకత్వం వహించారు.


