● ఒకరు మృతి
● 15 మందికి గాయాలు
కొరాపుట్: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో లోయలో బస్సు పడడంతో ఒకరు మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం వేకువ జామున కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి సుంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్రా సరిహద్దుకు కూత వేటు దూరంలో ఒడి02డీఈ5446 నంబర్ గల ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఓల్వో బస్సు లోయలో పడిపోయింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కలహండి జిల్లా బలగాం గ్రామానికి చెందిన జంబాబ్ బిహారీ (50) మృతి చెందాడు. తీవ్రంగా గాయాలపాలైన జంబాబ్‌ని పొట్టంగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ బస్సు ఒడిశాలోని కలహండి జిల్లా నుంచి విశాఖ పట్నం వెళ్తుంది. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే జయపూర్, పొట్టంగి, సిమిలిగుడల నుంచి అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సుమారు 40 అడుగుల లోతుకి దిగి రాత్రి వేళ టవర్ లైట్ ఏర్పాటు చేశారు. రోప్ లైన్లు ఏర్పాటు చేసి 8 మందిని స్ట్రెచర్ల మీద తరలించారు. ప్రమాదం వేకువ జామున 3 గంటలకు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో విషమ పరిస్థితిలో ఉన్న ఇద్దరిని విశాఖ, నలుగురిని కొరాపుట్‌లోని ప్రభుత్వ షహీద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగతా వారు పొట్టంగి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై పొట్టంగి ఎమ్మెల్యే రామ చంద్ర ఖడం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ సాలురు–సుంకి ల మధ్య బస్సులు ప్రమాదానికి గురవుతుండడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.


