రాయగడ: స్థానిక ఉమాశంకర్ లైన్ సమీపంలోని అయ్యప్ప స్వామి మందిరం ప్రాంగణంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు గురుస్వామి ఎం.నాగేశ్వరరావు శనివారం తెలిపారు. పురాతనమైన అయ్యప్ప మందిరం ఇప్పటికే అందరి సహకారంతో అభివృద్ధి చెందగా ఉప ఆలయాల్లో భాగంగా గణేష్, సుబ్రహ్మణ్యం, హనుమాన్, దత్తాత్రేయ, మహాలక్ష్మి, సరస్వతి, మాలికాపురిమాత విగ్రహాలను ప్రతిష్టించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ప్రాంతానికి చెందిన ప్రముఖ వేద పండితులు వెంకటరామ్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఇందులో భాగంగా 22వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ, రక్షాబంధన్, అఖండ దీపార్చన, సాయంత్రం 4.30 గంటలకు కలశ యాత్ర ఉంటందన్నారు. 23వ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు క్షీరాభిషేకం, కుంకుమార్చన, సూర్య నమస్కారాలు, సాయంత్రం 4.30 గంటలకు మహాలింగార్చన, అష్టదిగ్భంధన పూజలు ఉంటాయి. చివరి రోజైన 24వ తేదీన ఉదయం ఎరిమిది గంటలకు సంప్రొక్షణ, హోమం, పూర్ణాహుతి, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయని నాగేశ్వరావు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.


