రాయగడ: కాసీపూర్‌లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కాంగ్రెస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందం శుక్రవారం పర్యటించనుంది. పి.సి.సి అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ ఈ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీని కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలో మాజీ మంత్రి సురేష్ కుమార్ రవుత్‌రాయ్, ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణిపతి, గునుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ, రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర సావుంత, మంగుఖిలి, మాజీ ఎంపీ యశ్వంత్ సింహ్ లగురీ, బుజబల్ మాఝి, మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణిపతి, రత్నమణి ఉలక, అమిత బిశ్వాల్ ఉన్నారు. సగుబారి, కంటమాల్ గ్రామాల ప్రజలతో సమావేశమై వివరాలను సేకరిస్తారు.
చెట్లు నరికితే చర్యలు తప్పవు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి ఎంవీ 109 గ్రామ సమీప అడవిలో బుధవారం రాత్రి కొంతమంది గ్రామస్తులు అటవీ శాఖ అనుమతి లేకుండా 20 చెట్లు నరికివేశారు. అయితే గురువారం ఈ విషయం తెలుసుకున్న ఫారెస్టర్ అడవిని చూసి విచక్షణారహితంగా చెట్లు నరికివేసిన గ్రామస్తులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే.. మల్కన్‌గిరికి చెందిన సురేంద్ర కుమార్ బేమల్ అనే వ్యక్తి అటవీ శాఖ అనుమతి లేకుండా తన సొంత భూమి పనులు కోసం గ్రామాస్తులు కొందరి సాయంతో చెట్లను నరికించాడు. వాటిలో ప్రభుత్వ భూములకు చెందిన కొన్ని చెట్లు ఉన్నాయి. సమాచారం రావడంతో ఫారెస్ట్ గార్డు ప్రశాంతి రౌత్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒక వ్యక్తి తన సొంత పనులు కోసం ఇలా చెట్లు అవసరమైతే ముందుగా అటవీ శాఖకు ఒక లేఖను రాయలని సూచించారు.
బైక్ చోరీ నిందితుడు అరెస్టు
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి బెజంగివాడ పంచాయతీలో నివసిస్తున్న సహదేవ్ సాహు అనే ఉపాధ్యాయుడి బైక్‌ను దొంగలించిన వ్యక్తిని కలిమెల పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే... బెంగంగ్‌వాడ పంచాయతీలో ఉన్న పాఠశాల ఉపాధ్యాయుడు సహదేవ్ గత ఆదివారం తన బైక్‌ను ఇంటిముందు పార్క్ చేశాడు. అయితే ఆ బైక్‌ను దొంగలించారు. దీంతో సోమవారం ఉదయం కలిమెల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఐఐసీ ప్రభుదత్ విశ్వాల్ కేసు నమోదు చేసి దర్యాస్తు చేపట్టారు. దీంట్లో భాగంగా బెంజంగవాడ గ్రామానికి చెందిన డి.ప్రకాశరావు అనే వ్యక్తి ఈ దొంగతనం చేసినట్లు తేలుసుకొని, బైక్, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామన్నారు.


