రాయగడ: జిల్లాలోని కాసీపూర్‌లో మంగళవారం చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి బీజేడీ సుప్రీం, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నిజనిర్ధారణ కమిటీ గురువారం సమితిలోని కంటామాల్ గ్రామంలో పర్యటించింది. మాజీ మంత్రులు జగన్నాథ సరక, రవినారాయణ నందొ, సీనియర్ నాయకుడు రమేష్ చంద్ర ప్రతాప్ స్వాయి, మాజీ ఎంపీ జిన్ను హికక, అనసూయా మాఝి లతో కలిసి పది మందితో కూడిన బృందం గ్రామస్తులతో సమావేశమైంది. సగుబారి నుంచి సిజిమాలి వరకు వేదంత కంపెనీ నిర్మిస్తున్న రహదారిని అడ్డుకున్నందుకు గ్రామస్తులు, పోలీసుల మధ్య జరిగిన దమన కాండకు సంబంధించి పూర్తి వివరాలను గ్రామస్తుల ద్వారా కమిటీ తెలుసుకుంది. సుమారు మూడు గంటల పాటు గ్రామస్తులతో సమావేశమైన కమిటిటీ అసలు ఈ సంఘటన ఎదురవ్వడానికి గల కారణాలను పరిశీలించింది. అనంతరం సగుబారిలో పర్యటించిన బృందం అక్కడి ప్రజలతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేడీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక మాట్లాడుతూ.. కాసీపూర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నుంచి విముక్తి లభించాలంటే ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవశ్యకత ఉందన్నారు. ప్రభుత్వం బాధిత గ్రామాలకు చెందిన ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేలా వారితో మరొసారి మంతనాలు చేయాలన్నారు. అంతేగాని పోలీసుల దుశ్చర్యలతో గ్రామస్తులను భయపెట్టే విధంగా వ్యవహరిస్తే ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందన్నారు. బాధిత గ్రామాల్లో సిజిమాలి బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి గ్రామ సభలను నిర్వహించాలని సూచించారు. ప్రజల అనుమతితోనే ఏదైన వికాశం చెందుతుందన్నారు. తమ బృందం సమీకరించిన నివేదికను బీజేడీ సుప్రీంకు అందజేస్తామన్నారు.


