పర్లాకిమిడి: ఏప్రిల్ ఒకటో ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, ఉత్కళ దివాస్, మహారాజా కృష్ణచంద్ర గజపతి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు స్థానిక జిల్లా పరిషత్తు కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం సాయంత్రం ఏ.డి.ఎం. (రెవెన్యూ) మునీంద్ర హనగ అధ్యక్షతన ముందస్తు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ఇన్‌చార్జి అధికారి పృథ్వీరాజ్ మండల్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, డి.పి.ఆర్.ఓ ప్రదీప్త గురుమయి, పురపాలక సంఘం ఈఓ లక్ష్మణ ముర్ము, తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 1న పట్టణంలో కుమ్మరి వీధి వద్ద ఉన్న మహరాజా విహార పార్క్ వద్ద మహరాజా కృష్ణచంద్ర గజపతి సమాధి వద్ద నివాళులర్పిస్తామన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు చిత్రకారవీధి, కొత్త బస్టాండ్, మార్కెట్ వరకు శోభాయాత్ర చేపడతామన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద రాజావారి విగ్రహానికి పూలమాలలు వేస్తామన్నారు. ప్రతి పాఠశాలలో ఉత్కళ రాష్ట్రం కోసం పోరాడి సాధించిన పర్లాకిమిడి మహరాజా కృష్ణచంద్రగజపతికి నివాళులర్పించాలన్నారు. ఏప్రిల్ 26న కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ జయంతి వేడుకలు కూడా నిర్వహించాలని మునీంద్ర హనగా కోరారు.
రహదారి పనుల ప్రారంభం
పర్లాకిమిడి: జిల్లాలో కాశీనగర్ బ్లాక్ కె.సీతాపురం పంచాయతీలో బిసిరింగి గ్రామానికి పది లక్షల రూపాయలతో పక్కా రోడ్డు పనులను ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి గురువారం ప్రారంభించారు. గ్రామానికి మూడు కల్వర్టులు, డ్రెయిన్, చెరువు పుణరుద్ధరణ పనులకు రూ.10 లక్షలు మంజూరయ్యాయి. కె.సీతాపురం నుంచి దేవుదళ గ్రామానికి రూ.5లక్షలతో పక్కా రోడ్డు పనులకు ఎమ్మెల్యే పాణిగ్రాహి శంకుస్థాపన చేశారు.


