సభలో ఎస్‌సీబీ రభస | - | Sakshi
Sakshi News home page

సభలో ఎస్‌సీబీ రభస

Mar 20 2026 7:56 AM | Updated on Mar 20 2026 7:56 AM

భువనేశ్వర్‌: కటక్‌ ఎస్‌సీబీ వైద్య బోధన ఆస్పత్రి అగ్ని ప్రమాదంపై ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ ముఖేష్‌ మహాలింగ్‌ రాజీనామా చేయాలని బిజూ జనతా దళ్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో రాష్ట్ర శాసన సభలో గురువారం గందరగోళంతో స్తంభించిపోయింది. సోమవారం జరిగిన విషాద ఘటనపై బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు దాడిని తీవ్రతరం చేస్తూ, ప్రముఖ ఆస్పత్రిలో భద్రతా ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపణతో చేసిన నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ నైతిక విలువలకు కట్టుబడి మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌కు బిజు జనతా దళ్‌ (బీజేడీ), కాంగ్రెస్‌ సభ్యులు కట్టుబడి ఉన్నారు. రాష్ట్రంలో ఎస్‌సీబీ వైద్య బోధన ఆస్పత్రి అగ్ని ప్రమాదం రాజకీయ వేడిని పెంచుతుండగా ప్రతిపక్షాలు ఈ విషయంపై శాసన సభలో గందరగోళం నిరవధికంగా కొనసాగుతుంది. ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సష్టించడంతో, పదేపదే వాయిదాలు పడటంతో సభా కార్యకలాపాలు విపరీతంగా ప్రభావితం అవుతున్నాయి. మంత్రి రాజీనామా చేసే వరకు సభలో ఈ పరిస్థితి కొనసాగుతుందని బిజూ జనతా దళ్‌ శాసన సభ్యులు హెచ్చరించారు. ప్రతికూల పరిస్థితుల్లో సభా కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలు కాక స్పీకర్‌ సురమా పాఢి సభలో శాంతియుత వాతావరణం పునరుద్ధరించే ప్రయత్నంలో సభను పలుమార్లు వాయిదా వేశారు. తొలుత ఉదయం 11.30 గంటలకు, తర్వాత మధ్యాహ్నం 1 గంటకు, ఆపై సాయంత్రం 4 గంటల వరకు సభను వాయిదా వేశారు. అప్పటికి సభలో విపక్షాల వేడి చల్లారక పోవడంతో సభ స్తంభించిపోయింది. సభలో సాధారణ పరిస్థితిని పునరుద్ధరించే ప్రయత్నంలో స్పీకర్‌ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం నిర్వీర్యమైంది. ఎలాంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు. స్పీకర్‌ ప్రయత్నం నీరు గారిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement