అందరి సహకారంతో ఉగాది ఉత్సవాలు
● జిల్లా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు కొండబాబు
రాయగడ: వచ్చే నెల 19వ తేదీన ఉగాది ఉత్సవాలను అందరి సహకారంతో ఘనంగా నిర్వహించాలని రాయగడ జిల్లా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు యాల్ల కొండబాబు అన్నారు. స్థానిక స్వాగత్ హోటల్ సమీపంలో గల కోదండ రామ మందిరంలో ఆదివారం సమాఖ్య సభ్యుడు డి.లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన ఉగాది సన్నాహాక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గత మూడేళ్లగా తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించామని, అదే తరహా ఈ ఏడాది కూడా ఉత్సవాలను రెట్టింపు ఉత్సాహంతో నిర్వహిద్దామన్నారు. అందుకు అందరి సహాయ, సహకారాలు ఎంతో అవసరమన్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతోపాటు తెలుగు వారి ఐక్యతను చాటి చెప్పే ఈ ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఇక్కడ జరుగుతున్న ఉగాది ఉత్సవాలు పొరుగున గల తెలుగు రాష్ట్రాల్లో సైతం అందరినీ ఆకరిస్తున్నాయన్నారు. రెండు రోజులపాటు ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. అందుకు అందరూ శ్రమదానం చేయాలే తప్ప.. ఎవ్వరినీ ఆర్థికపరంగా సహకరించాలని కోరలేదన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తుండటంతో గత మూడేళ్లగా ఉగాది ఉత్సవాలు అంబరాన్ని అంటాయన్నారు. ఈ ఏడాది ఉత్సవాల్లో భాగంగా కార్యాచరణ ప్రణాళికలను, అదేవిధంగా సూచనలు తీసుకునేందుకు తాము ఎప్పుడూ ఆహ్వానిస్తున్నామన్నారు. అందరి సలహాలు, సూచనల మేరకు ఉత్సవాలను నిర్వహించేందుకు సమావేశంలో చర్చించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఉగాది రోజున ప్రతీసారిలాగే కలశ యాత్ర నిర్వహిస్తుండటం ఆచారంగా మరిందని వివరించారు. దీనిని కొనసాగించడంతో పాటు ఈసారి మజ్జిగౌరి మందిరం నుంచి జరిగే కలశ యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎడ్ల బళ్లతో సహా వివిధ రకాల కళాకారులతో వేషాధారణలను ఏర్పాటు చేస్తామన్నారు. అప్పట్లో పండగ పబ్బాల్లో ఎడ్ల బళ్ల వేషాలు సంప్రదాయంగా పరిగణించేవారని, అదే ఆచారాన్ని కొనసాగించి కలశ యాత్రలో పాల్గొనేలా ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఉత్సవ వేదిక వద్ద సంస్కృతిక కార్యక్రమాలతోపాటు ఈసారి భిన్నంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చినవారు స్టాల్స్‌లో పెట్టే వివిధ ప్రదర్శనలను తిలకించే అవకాశం కలుగుతుందన్నారు.
ఉత్కళ తెలుగు సమాఖ్య ఉగాది
కార్యాలయం ఏర్పాటు..
ఈ సారి కొత్తతరహా ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని ఆది నుంచి ఉగాది ఉత్సవాలు ముగిసేంత వరకు రింగ్ రోడ్డు సమీపంలో తెలుగు సమాఖ్య ఉగాది కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కొండబాబు ప్రకటించారు. ఈ కార్యాలయంలో ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆసక్తి గల ప్రతి ఒక్కరూ వారి సలహాలు, సూచనలు, అదేవిధంగా దినసరి కార్యక్రమాలకు సంబంధించి చర్చించుకునే వీలు కలిగేలా వినియోగపడుతుందన్నారు. తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే తెలుగు వంటల ఫుడ్ స్టాల్‌ను ఈ సారి ఉత్సవ వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణంలో గల వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు, తెలుగు సంస్థలకు చెందిన వారు పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కళింగ వైశ్య సంఘం అధ్యక్షుడు కింతలి అమర్‌నాథ్, తెలుగు బ్రాహ్మణ సేవా సమాజం అధ్యక్షుడు రేజేటి శ్రీనివాస్ శర్మ, పతివాడ శ్రీనివాస్‌రావు, సి.హెచ్.సొంబాబు, వీరబాబు, తదితరులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.
అందరి సహకారంతో ఉగాది ఉత్సవాలు


