ఉగాది వేడుకలకు సన్నాహకాలు
జయపురం: జయపురం తెలుగు సాంస్కృతిక సమితి, ఉగాది వేడుకలు జరిపేందుకు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించింది. సమితి అధ్యక్షుడు బిరేష్ పట్నాయిక్ అధ్యక్షతన సిటీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఉగాది వేడుకల నిర్వహణపై సభ్యులు తమతమ అభిప్రాయాలు వెల్లడించారు. తెలుగు సాంస్కృతిక సమితి ఏర్పడిన నాటి నుంచి క్రమం తప్పకుండా ఏటా జరుగుతున్న ఉగాది వేడుకలు గత నాలుగేళ్ల నుంచి జరగడం లేదు. అయితే ఈ ఏడాది తప్పకుండా జరపాలని సమితి నిర్ణయించటంతో సమావేశంలో పాల్గొన్న సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ముందు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏటా ఉగాది వేడుకలు జరపాలని సభ్యులు సూచించారు. ఉగాది ఉత్సవాలతో పాటు సిటీ ఉన్నత పాఠవాల వార్షికోత్సవాలు కలపి రెండు దినాలు వేడుకలు జరపాలని సమావేశం నిర్ణయించింది. ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో శశిపట్నాయిక్, బి.సతీష్ కుమార్, జి.రాంబాబులను సభ్యులుగా నియమించారు. గతంలో తాము శ్రీపొట్టి శ్రీరాములు అంతర్జాతీయ విశ్వవిద్యాలయం నుంచి సాంస్కృతిక బృందాలను రప్పించేవారమని ఈ యేడాది కూడా శ్రీపొట్టి శ్రీరాములువిశ్వవిద్యాలయం వారిని ఒక సాంస్కృతిక టీమ్‌ను పంపమని కోరితే బాగుంటుందని తెలుగు సాంస్కృతిక సమితి మాజీ అధ్యక్షుడు వి.భాస్కర రావు సూచించారు. ఉగాది ఉత్సవాల ఖర్చులకు ప్రజల నుంచి చందాలు వసూలు చేయకుండా తెలుగు సాంస్కృతిక సమితి సభ్యులు సొంతంగా చందాలు వేసుకొని ఉత్సవాలు నిర్వహించాలని సభ్యులు ఇచ్చిన అభిప్రాయంతో సమావేశం ఏకీభవించింది. సమావేశంలో తెలుగు సాంస్కృతిక సమితి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత జయపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు వి.ప్రభాకర్, మాజీ కార్యదర్శి పి.మహేశ్వర రెడ్డి, ప్రస్తుత కార్యదర్శి వై.శ్రీనివాస ఖన్నా, ఎ.శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
ఉగాది వేడుకలకు సన్నాహకాలు


