వందల సంఖ్యలో వాటర్ మీటర్ల చోరీ
పర్లాకిమిడి: స్థానిక తొమ్మిదో వార్డు రంగిరీజు వీధిలో శనివారం రాత్రి కొందరు దుండగులు ప్రజారోగ్య శాఖ వాటర్ మీటర్లను కోసి పట్టుకెళ్లిపోయారు. ఉదయం రంగిరీజువీధి, వేంకటేశ్వర మందిరం వీధిలో పీహెచ్‌ఈడీ సరఫరా చేసిన తాగునీరు ఇంట్లోకి రాకపోవడంతో బయటకు వచ్చిచూడగా వాటర్ మీటర్లు కోసేయడంతో రోడ్డుపై తాగునీరు పారుతూ కనిపించింది. కొద్ది రోజుల కిందట 10, 9వ వార్డు కరణం వీధిలో కూడా ఒకేరోజు 17 తాగునీటి పైపులకు అమర్చిన వాటర్ మీటర్లను దొంగిలించారు. పర్లాకిమిడిలో 16వ వార్డులో వాటర్ మీటర్లు వందల సంఖ్యలో దొంగతనానికి పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వాటర్ మీటర్లలో రాగి ఉంటుందని, వాటిని బయటకు తీసి స్క్రాప్‌కు అమ్ముతున్నట్టు కొందరు చెబుతున్నారు. దీనిపై కరణం వీధి ప్రజలు పీహెచ్‌ఈడీ ఇంజినీర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. వాటర్ మీటర్లు గత రెండేళ్లుగా పైపులకు అమర్చినా ఇప్పటివరకూ ఒక్కసారి కూడా మీటర్ రీడింగ్ చేయలేదనే అపవాదు కూడా ఉంది. దీనిపై జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు, వినియోగదారులు కోరుతున్నారు.
వందల సంఖ్యలో వాటర్ మీటర్ల చోరీ
వందల సంఖ్యలో వాటర్ మీటర్ల చోరీ


