15 ప్రధానాంశాల ప్రణాళిక
భువనేశ్వర్: నూతన సంవత్సరం కార్యకలాపాలు ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి గురువారం కొత్తగా నియమితులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ 15 ప్రధాన అంశాల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించారు. ప్రభుత్వ పాలన బలోపేతం చేసి పరిపాలనా సంస్కరణలను వేగవంతం చేసి ప్రజలకు వేగవంతంగా సేవలు అందజేయడం ఈ కార్యాచరణ ప్రణాళిక లక్ష్యంగా పేర్కొన్నారు. ఒడిశా విజన్ 2036–2047తో దగ్గరి సంబంధం కలిగిన ప్రభుత్వ దీర్ఘకాలిక అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం శతాబ్ది పూర్తి పురస్కరించుకుని 2036 నాటికి రాష్ట్రాన్ని 500 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది జాతీయ వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి భారత దేశంలోని అగ్ర ఐదు అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటిగా ఉంచడం లక్ష్యంగా కార్యాచరణ కొనసాగించేందుకు సూచికగా కొత్త ప్రణాళిక దోహదపడుతుంది. జ్ఞాన ఆధారిత పరిశ్రమలు, సేవల రంగంలో కేంద్రీకృత వృద్ధి, వేగవంతమైన పారిశ్రామిక అనుమతులు, అవినీతిపై జీరో–టాలరెన్స్ విధానం కట్టుదిట్టమైన అమలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ప్రజాహిత చర్యలకు వేదికగా వేగవంతమైన, జవాబుదారీ పాలనను ప్రజలకు అందజేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రానున్న రెండేళ్ల లోపు ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ పోస్టులను కీలక పదవుల్లో సమర్థులైన అధికారులతో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అసమర్థులైన లేదా అవినీతిపరులైన సిబ్బందిని గుర్తించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 311, అనుబంధ సర్వీస్ నియమాల ప్రకారం తప్పనిసరి పదవీ విరమణతో సహా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన సీనియర్ అధికారులను ఆదేశించారు. పర్యవేక్షణ, జవాబుదారీతనం ప్రాముఖ్యత కోసం కొనసాగుతున్న ప్రాజెక్టులను క్రమం తప్పకుండా సమీక్షించాలని ముఖ్యమంత్రి కోరారు. విధాన పరిశోధన, మూల్యాంకనం, ప్రభావ అంచనా కోసం ఒక ప్రముఖ సంస్థగా భువనేశ్వర్‌లోని నబకృష్ణ చౌదరి సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్‌ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సచివాలయం నుంచి మండల స్థాయి వరకు అన్ని అధికారిక సమాచారాల్లో ఒడియాను ప్రత్యేకంగా ఉపయోగించి భాషా గౌరవాన్ని పరిరక్షించాలన్నారు. ఈ నియమం పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. డిజిటల్ ప్లాట్‌ఫారాలు, సోషల్ మీడియా ద్వారా లేవనెత్తిన ఫిర్యాదులతో సహా ప్రజల ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు. పౌరులతో చురుకై న సంబంధాన్ని కొనసాగించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. తరచూ క్షేత్ర స్థాయి వాస్తవాలను పర్యవేక్షించేందుకు తప్పనిసరిగా క్షేత్ర సందర్శనలు నిర్వహించడం ప్రధాన పాలన అంశాల్లో ఒకటిగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒడిశా పరిపాలనా వ్యవస్థలో వేగం, క్రమశిక్షణ, జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టేందుకు కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రభుత్వ విస్తృత కార్యాచరణగా స్వచ్ఛమైన పాలన, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సమ్మిళిత వృద్ధిని బలోపేతం చేయడానికి 15 అంశాల భావి కార్యాచరణ ప్రణాళిక నిర్ణయాత్మక అడుగుగా పేర్కొన్నారు.


