యువత క్రీడల్లో రాణించాలి
రాయగడ: యువత క్రీడల్లో రాణించాలని రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు అన్నారు. కొలనార సమితి తెరువలిలో గత ఏడాది డిసెంబర్ 14వ తేదీ నుంచి జరుగుతున్న తెరువలి ప్రీమియర్ లీగ్ (టీపీఎల్ ) క్రికెట్ టోర్నామెంట్ గురువారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నెక్కంటి క్రీడాకారులను ఉద్ధేశించి ప్రసంగించారు. క్రీడల్లో రాణిస్తే వారి భవిష్యత్ ఉజ్వలంగా మారుతుందన్నారు. ఆసక్తిని పెంచే ఇటువంటి తరహా పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రికెట్ టోర్నీ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు అశోక్ కుమార్ హికక, ఉపాధ్యక్షుడు అను బిశ్వాస్, కార్యదర్శి జగదీష్ మహాపాత్రో మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా టీపీఎల్ పేరిట క్రీకెట్ లీగ్ టోర్నీ నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో తెరువలి పరిసర ప్రాంతాలకు చెందిన 5 జట్లు పాల్గొనగా.. గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్ జి–సూపర్ కింగ్, అన్ ట్రేడర్ జట్లు పాల్గొన్నాయి. అత్యంత ఆసక్తికరంగా మారిన ఈ మ్యాచ్‌లో జి సూపర్ కింగ్ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా జరిగిన బహుమతులు ప్రదానోత్సవంలో విజేత జట్టుకు ట్రోఫితోపాటు రూ.50 వేల నగదు, అదేవిధంగా రన్నర్‌గా నిలిచిన అన్ ట్రేడర్ జట్టుకు ట్రోఫితోపాటు రూ.30 వేల నగదు, బహుమతిని అందించారు. కేసీసీబీ డైరెక్టర్ బనాఘటి తిరుపతి గౌరవ అతిథిగా, నెక్కంటి కృష్ణచైతన్య ప్రత్యేక అతిథిగా హాజరై క్రీడాకారులను అభినందించారు.


