పట్టణవాసుల జీవన నాణ్యతను పెంచాలి: మంత్రి
భువనేశ్వర్: పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి ప్రాథమిక పౌర సౌకర్యాలను మెరుగుదలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పట్టణవాసుల జీవన నాణ్యతను పెంచాలని రాష్ట్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కృష్ణ చంద్ర మహాపాత్రో పిలుపునిచ్చారు. ఆయన అధ్యక్షతన గురువారం జరిగిన గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ వివిధ కార్యక్రమాల సమగ్ర సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. ముఖ్యమంత్రి సొహరి బికాష్ యోజన (ఎంఎస్‌బీవై), సొహజోగ్ వంటి ప్రధాన కార్యక్రమాల పురోగతి, పనితీరు, ప్రభావవంతమైన క్షేత్ర స్థాయి అమలుతో పాటు ఇతర కొనసాగుతున్న పట్టణాభివృద్ధి, పౌర మౌలిక సదుపాయాల కార్యక్రమాలపై ఈ సమావేశం దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా గుంతల తొలగింపు కార్యాచరణ పురోగతిని మంత్రి నగరాల వారీగా సమీక్షించారు. అన్ని నగరాల్లోని గుంతల మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేయాలి. రహదారి భద్రతను పెంపొందించడానికి, సజావుగా ట్రాఫిక్‌ను నిర్ధారించడానికి మన్నికై న, అధిక నాణ్యత ఇంజినీరింగ్ పరిష్కారాలను అవలంబించాలని మంత్రి సంబంధిత అధికారులు, పట్టణ స్థానిక సంస్థలను ఆదేశించారు. శాఖాపరమైన కార్యక్రమాలను నిరంతర క్షేత్ర పర్యవేక్షణ, కఠినమైన నాణ్యత నియంత్రణ, అమలు చేసే సంస్థల మధ్య సమర్థవంతమైన సమన్వయం పారదర్శకంగా అమలు చేసి విజయవంతం చేయాలని మంత్రి తెలిపారు. రాష్ట్రం అంతటా పట్టణ పాలనను బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడం, సురక్షితమైన, స్థిరమైన, పౌర–స్నేహపూర్వక పట్టణ వాతావరణాలను నిర్ధారించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను సమావేశం పునరుద్ఘాటించింది.


