పుష్‌పుణి వేడుకలకు సన్నాహాలు
జయపురం: సబ్ డివిజన్ పరిధి కుంద్ర సమితిలో ఆదివాసీ ప్రజల ముఖ్యమైన పండగల్లో ఒకటైన పుష్‌పుణి వేడుకలు ఘనంగా జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈనెల 6, 7 తేదీల్లో పుష్‌పుణి పర్వ్ వేడుకలు జరపాలని నిర్వాహక కమిటీ నిర్ణయించింది. రెండు రోజుల ఫుష్‌పుణి పర్వ్‌ను అంగరంగ వైభవంగా జరిపేందుకు చర్చించారు. ఆదివాసీ కళాకారులు వాయిద్యాలతో, నృత్యాలను ప్రజలను అలరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కుంద్ర సాహిద్ లక్ష్మణ నాయిక్ మూల ఆదివాసీ సంఘ కార్యదర్శి త్రినాథ్ సమరథ్, ఉద్యోగ సంఘ అధ్యక్షుడు భజమన్ శాంత, ఎంపీ ప్రతినిధి అంబు పాత్ర, కమిటీ కోశాదికారి మాలీ నాయిక్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో తాపీమేస్త్రి దుర్మరణం
జయపురం: రోడ్డు ప్రమాదంలో తాపీమేస్త్రి దుర్మరణం పాలైన ఘటన బొయిపరిగుడ పోలీసుస్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బొయిపరిగుడ సమితి చత్రపుట్ గ్రామానికి చెందిన భగత్ పొరజ కుమారుడు తరుణ పొరజ(35) తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. అతడు బుధవారం బొయిపరిగుడ నుంచి తన గ్రామానికి నడిచి వెళ్తుండగా వెనుకనుంచి వచ్చిన బైక్ ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే ద్విచక్ర వాహనదారుడు బైక్‌ను వదిలి పరారయ్యాడు. రోడ్డుపై పడిపోయిన తరుణ పొరజను చూసిన స్థానికులు బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. జయపురం హాస్పిటల్‌లో అతడిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణమైన బైక్‌ను పోలీసులు సీజ్‌చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భారీగా గంజాయి పంట ధ్వంసం
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ పోలీసులు 124 ఎకరాల్లో పండిస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొయిపరిగుడ సమితి కాటపొడ గ్రామ పంచాయతీ డొమినిజొడి గ్రామ సమీప అడవిలో గంజాయి పండిస్తున్న సమాచారం పోలీసులకు వచ్చింది. దీంతో ఆయా ప్రాంతంలో దాడులు జరిపి గంజాయి పంటను ధ్వంసం చేశారు. ఎవరైనా గంజాయి పండించడం, క్రయ, విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
విజిలెన్స్ డైరెక్టరేట్‌లో ప్రత్యేక ఏఐ సెల్ ఏర్పాటు
భువనేశ్వర్: అవినీతి నిరోధక ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఒడిశా విజిలెన్స్ అధునాతన సాంకేతికత, కృత్రిమ మేధస్సు (ఏఐ)ని అవలంబిస్తోంది. డేటా ఆధారిత సాధనాలను విజిలెనన్స్ కార్యకలాపాలలో అనుసంధానించేందుకు విజిలెన్స్ డైరెక్టరేట్‌లో ప్రత్యేక ఏఐ సెల్ ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలో మండల స్థాయిలో ఏఐ బృందాలు ఉంటాయి. ఈ చొరవలు ఏఐ ఆధారిత ఆర్థిక విశ్లేషణ, ప్రొఫైలింగ్, ఆదాయ లీకేజీల అంచనా, డిజిటల్ పాదముద్ర ట్రాకింగ్, డిజిటల్ ఫోరెన్సిక్స్, డేటా విశ్లేషణలు, డాక్యుమెంటేషన్ ప్రామాణీకరణకు మద్దతు ఇస్తాయి. వినూత్న ఏఐ పరిష్కారాలను రూపొందించడానికి, అమలు చేయడానికి ఏఐ సెల్ అంతర్గత అధికారులు, బాహ్య డొమైన్ నిపుణుల నుంచి నైపుణ్యం అనుసంధానం ప్రధాన సోపానంగా కొనసాగుతుంది. ఈ సాంకేతికత ఆధారిత విధానం ద్వారా అవినీతి నిరోధక కార్యకలాపాల్లో దర్యాప్తు సామర్థ్యం, విశ్లేషణాత్మక కచ్చితత్వం, సమగ్ర ఫలితాలను మెరుగుపరచడం ఒడిశా విజిలెన్స్ లక్ష్యంగా విభాగం పేర్కొంది.
పుష్‌పుణి వేడుకలకు సన్నాహాలు
పుష్‌పుణి వేడుకలకు సన్నాహాలు


