పంటకు కాపలా
జయపురం: కొరాపుట్ జిల్లాలలో ధాన్యం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మండీలు ప్రారంభించి రైతులకు టోకెన్‌లు ఇవ్వటంతో రైతులు మండీలకు ధాన్యం బస్తాలు తెచ్చి కుప్పలు వేస్తున్నారు. అయితే కొనుగోలు చేయాల్సి ప్రొక్యూర్‌మెంటు సంస్థలు, మిల్లర్లు ధాన్యం ఖరీదు చేసేందుకు రాకపోవటంతో అనేక మండీలలో వేలాది క్వింటాళ్ల ధాన్యం బస్తాలు పడి ఉంటున్నాయి. అలా జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి చికమా మండీలో వేలాది ధాన్యం బస్తాలు పడి ఉన్నాయి. ఆ మండీలో 4 వేల క్వింటాళ్ల ధాన్యం కొనేందుకు 81 మంది రైతులకు టోకెన్‌లు ఇచ్చారని రైతులు తెలిపారు. ఈ మండీలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు నలుగురు మిల్లర్స్‌కు అప్పగించారని అయితే వారిలో రెండు మిల్లుల వారు వచ్చి వారికి కేటాయించిన ధాన్యం కొన్నారని రైతులు వెల్లడించారు. సోమవారం రాత్రి 7 గంటల వరకు మిగతా మిల్లర్లు రాకపోవటంతో తాము నిరాశ చెందామని వెల్లడించారు. అనంతరం తాము లేంప్స్ మేనేజింగ్ డైరెక్టర్‌తో ఫోన్‌లో సంప్రదించగా మిల్లు యజమానులు రారని తెలిపారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చికమా మండీలో ధాన్యం తెచ్చిన రైతుల్లో 15 మంది రైతుల ధాన్యం దాదాపు వెయ్యి క్వింటాళ్లు పడి ఉండగా వాటిని కాపలా కాసేందుకు 15 మంది రైతులు ఎముకులు కొరికే చలిలో మంటలు వేసుకొని ఉంటున్నారు.


