గుణుపూర్‌లో ఏనుగుల హల్‌చల్
● భయాందోళనలో ప్రజలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ అటవీ రేంజ్ పరిధిలోని ఖొయిర, ఫులోపుటి, తరమాల్, జంపాపుర్ తదితర అటవీ ప్రాంతాల్లో వారం రోజులుగా ఏనుగులు సంచరిస్తుండటంతో ఆప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండాపోతుంది. ఎప్పుడు ఏ సమయంలో ఏనుగులు ఇళ్లల్లోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తాయోనన్న భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఒక ఏనుగు పొలాల్లోకి చొరబడి పంటలను ధ్వంసం చేసింది. దీంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఏనుగు పాలయ్యిందని లబోదిబోమంటున్నారు. ఉదయం పూట అడవుల్లోకి వెళ్లి ఉంటున్న ఏనుగు రాత్రయ్యే సరికి పంట పొలాలు, గ్రామాల్లోకి చొరబడుతుందని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారాన్ని సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో అటవీ శాఖ సిబ్బంది గ్రామస్తులతో కలిసి రాత్రి పూట చలి మంటలు వేసుకుని టార్చిలైట్లను పట్టుకుని కాపాలా కాస్తున్నారు. అయితే ఏనుగులను సంరక్షించడంతో పాటు వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఈ తరహా చర్యలను చేపడుతున్నామని రేంజర్ గంగాధర్ మిశ్రో తెలియజేశారు. ఏనుగులు తారాసపడే సమయంలో వాటి ముందుకు వెళ్లకూడదని, సాయంత్రంలోగా పనులు ముగించుకుని ఇళ్లళ్లో ఉండాలని ప్రజలను చైతన్య పరుస్తున్నామని చెప్పారు.
గుణుపూర్‌లో ఏనుగుల హల్‌చల్


