30న ధాన్యం కొనుగోలు ప్రారంభం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఈ నెల 30న పర్లాకిమిడి, కాశీనగర్, గుసాని, రాయఘడ బ్లాక్‌లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రైతులు ధాన్యాన్ని మండీలకు తెచ్చినప్పుడు ఎండలో ఆరబెట్టి, ఎగరబోసిన ధాన్యం సంచుల్లో తేవాలని నియంత్రణ బజార్ కమిటీ (ఆర్.యం.సీ.) కార్యదర్శి రేబతి మోహన్ రౌతో అన్నారు. దీనిని రైతులందరికీ తెలియజేసేలా ప్రచార రథాన్ని కలెక్టర్ మునీంద్ర హనగ కలెక్టరేట్ వద్ద ప్రారంభించారు. సాధారణ ధాన్యం ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.3,169, గ్రేడ్–ఎ ధాన్యం క్వింటా రూ.3,189, ఇన్‌పుట్ సబ్సిడీతో కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని సబ్ కలెక్టర్ అనుప్ పండా తెలిపారు. ఈ ప్రచార రథం జిల్లాలో కాశీనగర్, గుసాని, గుమ్మ, రాయఘడ సమితిల్లో బుధవారం నుంచి ప్రచారం చేయనుందన్నారు.
నిరసన..
పర్లాకిమిడి: బంగ్లాదేశ్‌లో హిందువు దిప్పు చంద్రదాస్‌పై ఆ శీయులు దాడులు చేసి అతికిరాతకంగా తగులబెట్టడాన్ని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు తీవ్రంగా ఖండించారు. పర్లాకిమిడిలో బుధవారం జగన్నాథ మందిరం నుంచి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. భారత్ ఇటువంటి ఘటనలపై ఊరుకుంటే.. సమీప భవిష్యత్తులో ఇండియాలో కూడా రోహ్యింగాలు రెచ్చిపోయే అవకాశం ఉందన్నారు. హోంశాఖ తగిన చర్యలు చేపట్టి బంగ్లాదేశ్‌కు బుద్ధి చెప్పాలను వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు లోకనాథ మిశ్రా పాతబస్టాండ్ వద్ద అన్నారు. ఈ ఆందోళనలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు కై లాష్ చంద్ర గౌడో, కార్యదర్శి శ్యాంసుందర్ శోబోర్, ముఖ్య ఆర్గనైజర్ నారాయణ రైతో, మహంత రామానంద దాస్, జగన్నాఽథ్, నరేంద్ర జన్ని (గంజాం), తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు మండీ ప్రారంభం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎంసీ కార్యాలయ ప్రాంగణంలో ధాన్యం కొనుగోలు సేకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రైతుల కష్టానికి ఫలితంగా ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించిందన్నారు. 2025–26 ఖరీఫ్ సంవత్సరానికి అర్హత పొందిన రైతులకు ఎఫ్‌ఏక్యూ ప్రమాణాల సాధారణ ధాన్యానికి కనీస మద్ధతు ధర క్వింటాల్‌కు 2369 రూపాయలుగా నిర్ణయించడంతోపాటుఇన్‌పుట్ సబ్సిడీ కలిపి మొత్తం 3100 రూపాయలుగా రాష్ట్రప్రభుత్వం ధర నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సజావుగా ధాన్యం కొనుగోలు జరిగేందుకు అవసరమైన అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయని, రైతులకు సరైన ధర అందేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. నమోదైన రైతులకు ముందస్తు సమాచారం అందించి టోకెన్లు జారీ చేస్తున్నామని చెప్పారు. రైతుల సౌకర్యార్ధం అన్ని అనుబంధ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 68 మండీలు ఉండగా 47,770 మంది రైతులు నమోదు చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. మండీ నోడల్ అధికారులు, సూపర్‌వైజర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
30న ధాన్యం కొనుగోలు ప్రారంభం


