ఖనిజ సంపద దోపిడీ
● ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భుపేష్ భగేల్
రాయగడ: అపారమైన ఖనిజ సంపద గల రాష్ట్రా న్ని అధికార బీజేపీ దోచుకుని, వారి అనుయాయులకు (ప్రైవేట్ కంపెనీలకు) ధారాదత్తం చేస్తోందని ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భుపేష్ భగేల్ అన్నారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి స్వర్గీయ రామచంద్ర ఉలక విగ్రహాష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తేజస్వీ మైదానంలో కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర ఉలక ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. భుపేష్ భగేల్ మాట్లాడుతూ.. ఈ ప్రాంత ఖనిజ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అవసరమైతే దీనిని అడ్డుకునేలా ఆందోళనలను నిర్వహించి, బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. పరిశ్రమల పేరిట ఉన్న ఖనిజ సంపదను అంతా దోచుకునేందుకు వ్యూహం పన్నుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఖనిజ సంపదపై కన్ను వేసిందన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా పలుసార్లు ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నారంటే అది మీపై ప్రేమ ఏమాత్ర కాదని, ఆయనకు అవసరమైన ఖనిజ సంపదను దోచుకునేందుకు మాత్రమే ఇక్కడకు వచ్చి మంతనాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇకపై బీజేపీ ఆటలు సాగనివ్వం..
గత రెండు దశాబ్దాలకు పైబడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేడీకి కాలం చెల్లగా.. ఏదో అవకాశం దొరికిన బీజేపీ పనితీరును ప్రజలు బాగా గుర్తించారన్నారు. ఇకపై ఈ రెండు పార్టీలను ప్రజలు ఆదరించేది లేదని పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ అన్నారు. బీజేడీ, బీజేపీలపై విమర్శనాస్త్రాలను సంధించారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ రాష్ట్రం భవిష్యత్‌లో అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి స్వర్గీయ రామచంద్ర ఉలక ఉన్న సమయంలో పార్టీ ఒక వెలుగు వెలిగిందన్నారు. త్వరలో కాంగ్రెస్‌కు మంచి రోజులు రావడంతోపాటు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలక మాట్లాడుతూ అవిభక్త కొరాపుట్ జిల్లాలో కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. వారి ఆదరాభిమానాలతో గత ఎన్నికల్లో ఆరు శాసనసభ స్థానాలు, ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ సంపాదించుకుందన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. పీపీసీ మాజీ అధ్యక్షుడు ప్రసాద్ హరిచందన్, జయదేవ్ జెన్న, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, భవానీపట్నం ఎమ్మెల్యే సాగర్ దాస్, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర సామంత, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణిపతి తదితరులు పాల్గొన్నారు.
ఖనిజ సంపద దోపిడీ


