
ఎస్‌ఐఆర్‌కు బీజేడీ వ్యతిరేకం
భారత ఎన్నికల కమిషన్‌తో బీజేడీ ప్రతినిధి బృందం భేటీ
భువనేశ్వర్: బీహార్ తరహాలో ఒడిశాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) అమలు పట్ల బిజూ జనతా దళ్ వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ చర్యతో పెద్ద సంఖ్యలో అర్హత కలిగిన ఓటర్లు మినహాయించబడతారని, ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉన్నందున ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘానికి బిజూ జనతా దళ్ ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. బీహార్‌లో ఈ ప్రక్రియలో వాస్తవ ఓటర్లను విస్మరించారని తెలిసిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించే సదుద్దేశంతో అన్ని వర్గాల వాటాదారుల చురుకై న భాగస్వామ్యంతో ఎస్‌ఐఆర్ అమలు చేయాలని భారత ఎన్నికల సంఘానికి ప్రతినిధి బృందం విన్నవించింది. ఈ బృందం ప్రతిపాదనల్ని పరిగణనలోకి తీసుకుని పరిశీలించడం జరగుతుందని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అభయం ఇచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల్లో భారీ అవకతవకలు తలెత్తాయి. వాటికి సంబంధించి గత ఏడాది డిసెంబర్ నుంచి డజనుకు పైగా లేవనెత్తిన వివిధ అంశాలపై ఎన్నికల సంఘం స్పందన కొరవడిందని ప్రతినిధి బృందం విచారం వ్యక్తం చేసింది. అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం ఫారం 17–సి జారీ చేయకపోవడంతో ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓటర్ల మనస్సులో ఏర్పడిన సందేహాలు నివృత్తి కావడం లేదని వివరించారు. 2024 ఎన్నికలు పురస్కరించుకుని ఈవీఎంలలో నమోదైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం పట్ల సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బూత్ స్థాయి, పార్లమెంటరీ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం మధ్య వ్యత్యాసం గురించి పార్టీ లేవనెత్తిన అభ్యంతరాలపై ఇంత వరకు సంతృప్తికరమైన సమాధానం రాలేదని ఎన్నికల సంఘం ప్రముఖులతో సమావేశంలో బీజేడీ ప్రతినిధి బృందం ప్రస్తావించింది. ఓటింగ్ తర్వాత, అనేక బూత్‌లలో ఫారం 17–సిలో పేర్కొన్న ఓట్ల సంఖ్య, లెక్కింపు సమయంలో వచ్చిన ఓట్ల సంఖ్యతో సరిపోలలేదు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. పోలింగ్ నాడు సాయంత్రం 5 గంటల తర్వాత ఓటర్ల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంపై విస్మయపరిచింది. ఎన్నికల్లో స్వచ్ఛమైన, నిష్పాక్షిక ప్రక్రియ కోసం బిజూ జనతా దళ్ పలుమార్లు ఎన్నికల సంఘానికి చేసిన అభ్యర్థనలు ఇంత వరకు ఎలాంటి స్పందన నోచుకోక పోవడం విచారకరమని తెలియజేశారు. దేబీ ప్రసాద్ మిశ్రా ఆధ్వర్యంలో ప్రమీలా మల్లిక్, సంజయ్ దాస్ బర్మా, డాక్టర్ అమర్ పట్నాయక్, సులతా దేవ్‌లతో సహా బీజేడీ ప్రతినిధి బృందం న్యూ ఢిల్లీ నిర్వాచన్ సదన్‌లో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిలతో ముఖాముఖి సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి తమ అభిప్రాయాలు, సూచనలను తెలియజేశారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నాయకులతో కొనసాగుతున్న సంభాషణలలో ఈ సమావేశం భాగమని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పేర్కొంది. ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంలో ఈ సలహాలు, సూచనలు దీర్ఘకాల ప్రయోజనాలకు దోహదపడతాయని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆశాభావం వ్యక్తం చేసింది.

ఎస్‌ఐఆర్‌కు బీజేడీ వ్యతిరేకం