
సెప్టెంబర్ 18 నుంచి శాసన సభ వర్షాకాల సమావేశాలు
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభలో వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ నెల 18 నుండి 25 వరకు జరగనున్నాయి. ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాసన సభ వ్యవహారాల మంత్రి డాక్టరు ముఖేష్ మహాలింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ఏడు పని దినాలు ప్రణాళిక చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రయోజన అంశాలపై చర్చలు, ప్రతిపాదిత కీలక బిల్లులు, అధికార పార్టీ, ప్రతిపక్షాల క్రియాశీల భాగస్వామ్యం ఉంటాయి. ఏడు రోజులలో, ఒక రోజు ప్రైవేట్ సభ్యుల బిల్లులకు, మరొక రోజు కార్యాలయం రహిత దినం (నో ఆఫీస్ డే) ఉంటుంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ తీసుకున్న నిర్ణయాల ప్రకారం, ఈ సమావేశంలో అనేక ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టవచ్చు. ప్రతిపక్షాలు ప్రతిపాదించే ఏ అంశంౖపైనెనా ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధ్రువీకరించింది. ప్రతిపక్ష పార్టీలు సమర్పించిన నిర్మాణాత్మక ప్రతిపాదనలపై కూడా చర్చలను ప్రభుత్వం స్వాగతిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ పేర్కొన్నారు. ఇటీవలి సంఘటనలు, భారత ప్రభుత్వం దాదాపు రూ. 8,000 కోట్లు మంజూరు చేసిన క్యాపిటల్ రీజియన్ రింగ్ రోడ్ (సీఆర్‌ఆర్‌ఆర్), ఒడిశాకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 4,500 కోట్ల విలువైన రెండు సెమీ కండక్టర్ తయారీ యూనిట్లు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పరిధితో సహా రాష్ట్రానికి మంజూరు చేసిన నాలుగు జలమార్గ ప్రాజెక్టులు వంటి కీలక అంశాలను ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు రాష్ట్ర శాసన సభవ్యవహారాల మంత్రి ముఖేష్ మహాలింగ్ తెలిపారు. శాసన సభ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలు, కీలక బిల్లులు, రైతుల దుస్థితి, మహిళలు, బాలికలు మరియు విద్యార్థులపై నేరాలు, సామూహిక అత్యాచారం, గూండాయిజం మరియు భువనేశ్వర్ మెట్రో (రైలు) ప్రాజెక్టు నిలిపివేత వంటి సంబంధిత అంశాలను శాసన సభ వర్షా కాలం సమావేశాల్లో ప్రస్తావిస్తామని విపక్ష బిజూ జనతా దళ్ నాయకురాలు ప్రమీలా మల్లిక్ అన్నారు. ఆయా అంశాల్లో ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన సమస్యల పట్ల ప్రభుత్వం నుండి జవాబుదారీతనం కోరడం తమ ఉద్దేశమని పేర్కొన్నారు.