
కోతకు గురవుతున్న నాగావళి తీరం!
భయాందోళనలో ప్రజలు
నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి
రాయగడ: కొద్ది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సదరు సమితి బొడోరాయిసింగి గ్రామ సమీపంలో నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తీర ప్రాంతం కోతకు గురవుతుంది. పెద్ద బండరాళ్లు, మట్టిపెళ్లలు జారి పడుతున్నాయి. నదీ ప్రవాహం ఉద్ధృతం కావడంతో గ్రామం ముంపునకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదీ తీర ప్రాంతాలు కోతకు గురవ్వకుండా యంత్రాంగం చేపట్టిన చర్యల్లో భాగంగా గత ఏడాది బొడోరాయిసింగి నదీ తీర ప్రాంతంలో సురక్షిత గట్లను జలసంపద విభాగం చేపట్టింది. సుమారు 7.16 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాంతంతో రాళ్లతో పనులను చేపట్టారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా రాళ్ల ప్యాకింగ్ నాణ్యత కోల్పోయి జారిపడుతున్నాయి. దీంతో తీరప్రాంతం కోతకు గురవుతుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నదీతీరం కోతకు గురికాకుండా నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

కోతకు గురవుతున్న నాగావళి తీరం!

కోతకు గురవుతున్న నాగావళి తీరం!