
నీట్‌లో సత్తాచాటిన గిరిజన విద్యార్థిని
భువనేశ్వర్: రాష్ట్రంలో మారుమూల మల్కన్‌గిరి జిల్లాలోని కోరుకొండ మండలం నక్కమాముడి పంచాయతీ పరిధి అమ్లిబేడ గిరిజన గ్రామానికి చెందిన విద్యార్థిని చంపా రాస్‌పెదా నీట్ పరీక్షలో సత్తాచాటింది. నీట్ 2025లో అర్హత సాధించడంతో బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ మెడికల్ కాలేజ్ – ఆస్పత్రిలో సీటు సాధించింది. విద్యార్థిని తండ్రి సన్నకారు రైతు, తల్లి సాధారణ గృహిణి. చిత్రకొండ ఎస్‌ఎస్‌డీ బాలికల ఉన్నత పాఠశాలలో 2019 సంవత్సరంలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత సాధించింది. 2021 సంవత్సరంలో గోవిందపల్లి ఎస్‌ఎస్‌డీ ఉన్నత మాధ్యమిక పాఠశాల నుంచి +2 సైన్స్‌లో ఉత్తీర్ణత సాధించి, బీఎస్సీ చదివేందుకు ఆర్థిక స్తోమత లేక డిగ్రీ చదువుకు స్వస్తి పలికింది. అయితే డాక్టర్ కావాలనే కల సాకారం చేసుకోవాలనే పట్టుదలతో ఏమాత్రం సడలిపోకుండా తన వంతు ప్రయత్నంలో తలమునకలైంది. బాలిక మేధస్సు, పట్టుదలని గుర్తించిన ఆమె మాజీ సైన్స్ ఉపాధ్యాయుడు ఉత్కళ కేశరి దాస్ మార్గదర్శిగా కల సాకారం చేయడంలో చేయూతనిచ్చారు. ఆశయ సాధనకు అందిన అవకాశం సద్వినియోగపరచుకుని బాలసోర్‌లోని ఉచిత నీట్ కోచింగ్ తరగతుల్లో చేరింది.
ఈ కేంద్రంలో పొందిన శిక్షణతో తొలి ప్రయత్నంలోనే నీట్ పోటీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సరికొత్త చరిత్రని ఆవిష్కరించింది. చంపా రాస్‌పెదా ఉత్తీర్ణతపై సీఎం మోహన్ చరణ్ మాఝి అమితానందం వ్యక్తం చేశారు. ఆమె భవిష్యత్‌లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.