
మధ్యంతర నివేదిక సమర్పణ
భువనేశ్వర్: స్థానిక లోక్‌సేవ భవన్‌లో 6వ రాష్ట్ర ఆర్థిక సంఘం మధ్యంతర నివేదికను సీఎం మోహన్ చరణ్ మాఝికి సమర్పించింది. ఈ సందర్భంగా కమిషన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ పండా ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ అసిత్ రంజన్ మహంతి, ప్రొఫెసర్ అమరేష్ సామంతరాయ్, బిభు ప్రసాద్ నాయక్, సభ్య కార్యదర్శి డాక్టర్ సత్యప్రియ రథ్, ఎక్స్– అఫీసియో సభ్యుడు అరిందం డకువా ముఖ్యమంత్రిని కలిసి సమావేశమయ్యారు. కమిషన్ వివిధ సిఫార్సులను వారు ముఖ్యమంత్రికి వివరించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ మరియు పట్టణ స్థానిక సంస్థల మధ్య రాష్ట్ర ఆదాయాల పంపిణీ నియంత్రణ వ్యవస్థ బలోపేతం దిశలో పలు సిఫార్సులతో నివేదిక రూపుదిద్దుకున్నట్లు తెలిపారు. ఈ సంస్థల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం ఆర్థిక సంఘం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. మధ్యంతర నివేదిక స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్ల దృష్ట్యా తక్షణ ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు దోహదపడుతుంది. నిర్ణీత కాల పరిమితిలో తుది నివేదికను సమర్పించాలని కమిషన్ యోచిస్తోంది. రాష్ట్రం వసూలు చేసే పన్నులు, సుంకాలు, టోల్‌లు మరియు రుసుముల కేటాయింపును క్రమబద్ధీకరించడానికి కీలకమైన సూచనలను ప్రతినిధి బృందం చర్చించింది. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీటి శాఖ మంత్రి రబీ నారాయణ్ నాయక్, గృహ నిర్మాణం – పట్టణాభివృద్ధి మరియు ప్రభుత్వ సంస్థల విభాగం మంత్రి కృష్ణ చంద్ర మహాపాత్రో, ప్రధాన కార్యదర్శి మనోజ్ ఆహుజా, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి శాశ్వత్ మిశ్రా, గృహ నిర్మాణం – పట్టణాభివృద్ధి విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషా పాఢి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ మిశ్రా, పంచాయతీ రాజ్ డైరెక్టర్ వినీత్ భరద్వాజ్ పాల్గొన్నారు.