
రాష్ట్ర బీజేపీ చీఫ్ సమావేశం
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2025
అమిత్ షాతో..
భువనేశ్వర్:
రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ మన్మోహన్ సామల్ సోమవారం న్యూ ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దీన్ని మర్యాదపూర్వక సమావేశంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర అగ్ర శ్రేణి నాయకులు తరచూ సమావేశం అవుతుండడంపై సర్వత్రా ఉత్కంఠ బిగుసుకుంటోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ కలయికలు, సమావేశాలు, చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నెల ప్రారంభంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్‌దేవ్ న్యూ ఢిల్లీలో అమిత్ షాను కలిశారు. గత వారం అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జె. పి. నడ్డాతో కలిసి వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఒడిశా అగ్ర శ్రేణి నాయకత్వంతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి నేతృత్వంలో రాష్ట్రంలో తొలి సారిగా ఏర్పాటైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నా మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ జరగ లేదు. మరో వైపు కీలకమైన రాష్ట్ర కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల అధిపతుల పేర్లను ఖరారు చేయడంపై ఊహాగానాల నేపథ్యంలో ఉభయ రాష్ట్ర, కేంద్ర నాయకుల సమావేశాలు చర్చనీయాంశమవుతున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రితో సోమవారం జరిగిన చర్చలకు సంబంధించి కచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక, రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత సామర్ధ్యం బలోపేతం, రాష్ట్ర, జాతీయ ప్రాధాన్యతల సమన్వయంతో సమగ్ర పురోగతి అంశాలపై చర్చ కొనసాగినట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ఒక సందేశం జారీ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి లక్ష్యంగా వికసిత భారత్ సంకల్పం సాకారం చేయడంలో ఒడిశా కీలక పాత్రపై ప్రధాన చర్చ జరిగింది. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మన్మోహన్ సామల్ వ్యూహాత్మక మార్గదర్శకత్వం పట్ల అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

రాష్ట్ర బీజేపీ చీఫ్ సమావేశం

రాష్ట్ర బీజేపీ చీఫ్ సమావేశం