
రైలు పట్టాలపై సౌర విద్యుత్ ఉత్పాదన
భారతీయ రైల్వే వినూత్న కృషి
భువనేశ్వర్: ప్రయాణికులు, సరుకు రవాణాలో సాటి లేని మేటి సంస్థగా వెలుగొందుతున్న భారతీయ రైల్వే బహుముఖ లాభసాటి చర్యలతో మరింత ఎదగాలనే దృక్పథాన్ని బలపరచుకుంటోంది. ప్రయాణికుల పాసింజరు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సరుకు రవాణా (గూడ్సు) రైళ్లు శరవేగంతో దూసుకు పోయేందుకు ఆధారంగా నిలిచే పట్టాల వినియోగాన్ని మరింత సఫలీకృతం చేసే దిశలో రైల్వే శాఖ వినూత్న ప్రయోగానికి సాహసించింది. రైలు పట్టాల మధ్య విస్తరించిన సుదూర పొడుగాటి స్థలంలో సౌర శక్తి ఉత్పాదన కోసం సంకల్పించింది. ఈ స్థలంలో సౌర శక్తి పలకలు (సోలార్ ప్యానెల్) వైజ్ఞానికతో కూడిన సాంకేతిక అమరికతో సౌర శక్తి ఉత్పాదన సుసాధ్యమేనని నిర్ధారించింది. భారత దేశంలో తొలి సారిగా వారణాసిలోని బెనారస్ లోకో మోటివ్ వర్‌ుక్స (బీఎల్‌డబ్ల్యూ) ఈ ప్రయోగానికి ముందడుగు వేసింది.
సౌర శక్తి ఉత్పాదన అంచనా
రైళ్లు పరుగులు తీస్తున్న పట్టాల మధ్య ఖాళీ స్థల భాగంలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రామాణికంగా సౌర శక్తి పలకల అమరికతో హరిత విద్యుత్ ఉత్పాదన సాధ్యాసాధ్యాల కార్యాచరణ మొదలైంది. అధికారుల అంచనా ప్రకారం 70 మీటర్ల రైలు మార్గం (ట్రాక్) వెంబడి 28 సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుతో 15 కిలో వాట్‌ల పీక్ పవర్ ఉత్పత్తి సాధ్యమని భావిస్తున్నారు. ఈ ఏర్పాటుతో పర్యావరణ కాలుష్యం తలెత్తకుండా సరళమైన నిర్వహణ, పరిరక్షణ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని భారతీయ రైల్వే శాఖ ఆచి తూచి అడుగు వేస్తుంది. సాధారణ నిర్వహణ కార్యకలాపాలు, వర్షాలు, వరదలు వంటి విపత్కర పరిస్థితుల్లో పట్టాల మధ్య అమర్చిన సౌర శక్తి ఉత్పాదక పలకల తొలగింపు, పునరుద్ధరణ ఈ వ్యవస్థలో సానుకూల చొరవ. భారతీయ రైల్వే సంకల్ప సిద్ధితో దేశంలో సౌర శక్తి ఉత్పాదన గణనీయంగా పుంజుకునే అవకాశాల పట్ల సర్వత్రా ఆశాభావం వ్యక్తం అవుతుంది

రైలు పట్టాలపై సౌర విద్యుత్ ఉత్పాదన