
ముఖ్యమంత్రిని కలిసిన బ్యాడ్మింటన్ అక్కాచెల్లెళ్లు
భువనేశ్వర్: ప్యారిస్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాడ్మింటన్ అక్కాచెల్లెళ్లు రుతుపూర్ణ పండా, శ్వేతపూర్ణ పండా సోమవారం స్థానిక లోక్ సేవా భవన్‌లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని కలిశారు. వీరివురు భారత దేశ తొలి తోబుట్టువుల బ్యాడ్మింటన్ క్రీడాకారిణులుగా పేరొందారు. ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న ప్రతిష్టాత్మక ప్యారిస్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రపంచ వేదికపై వారు అద్భుతమైన విజయాన్ని సాధించగల సామర్థ్యంపై నమ్మకం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి హృదయపూర్వకంగా బ్యాడ్మింటన్ అక్కాచెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.
జయపురం: జయపురం సమితి ఘివురి గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన కొట్లాటలో మరో ఇరువురిని అరెస్టు చేసినట్లు జయపురం సదర్ పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ సచీంధ్ర ప్రధాన్ సోమవారం తెలిపారు. జూలై 31వ తేదీన ఘివురి గ్రామ కూడలి వద్ద కొంతమంది యువకులు మాట్లాడుతుండగా వారిమధ్య వివాదం తలెత్తి కొట్లాటకు దారితీసింది. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే సదర్ పోలీసు స్టేషన్ పరిధి గగణాపూర్ పోలీసు పంటి అధికారి చిత్తరంజన్ ప్రదాన్ తన సిబ్బందితో సంఘటనా ప్రాంతానికి చేరుకొని ఉభయ వర్గాల వారిని శాంత పరచి గాయపడిన వారిని జయపురం జిల్లా కేంధ్ర హాస్పిటల్‌లో చేర్చారు. వారిలో ఎనిమిది మందిని ప్రాధమిక చికిత్స తరువాత విడిచి పెట్టామని తెలిపారు. ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావటంతో వారిని కొరాపుట్ సహిద్ లక్ష్యణ నాయిక్ వైద్య కళాశాల హాస్పిటల్‌కు తరలించారు. కొట్లాటలో నిందితులైన వారిలో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేశామన్నారు. అరెస్టయిన వారిలో ఘివురి గ్రామానికి చెందిన చందన హరిజన్, అజయ హరిజన్ ఉన్నారన్నారు. వారిని కోర్టులో హాజరుపరచినట్లు వెల్లడించారు.
పుట్టగొడుగులు తిని ఎనిమిది మందికి అస్వస్థత
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్ రామగిరి పోలీసుస్టేషన్ పరిధిలో విషాధ సంఘటన జరిగింది. రామగిరి పంచాయతీ దెవురి సాహి గ్రామంలో సోమనాథ బెహారా అడవిలో దొరికిన విషపు పుట్టగొడుగులు తిని వారి కుటుంబంలో ఎనిమిది మంది అస్వస్థతకు గురైయ్యారు. తొలుత క్షతగాత్రులను రామగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చిన తరువాత మెరుగైన చికిత్స కోసం చంద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం దెవురిసామి గ్రామంలో సోమనాథ బెహారా ఆవులు దొంగలాడటానికి వెళ్లి అడవిలో దొరికిన పుట్టుగొడుగులు సేకరించి ఇంటికి తీసుకొచ్చారు. కుటుంబసభ్యులు వండి తన అన్న కుటుంబానికి కూడా కూరను ఇచ్చాడు. పుట్టగొడుగులు కూర తిన్న రెండు కుటుంబ సభ్యులకు గొంతుకలో దురద ఏర్పడి తరువాత అస్వస్థత గురై అచేతనంగా పడిపోయారు. అంబులెన్సులో చంద్రగిరి సీహెచ్‌సీకి క్షతగాత్రులను తరలించారు. చికిత్స పొందిన తరువాత వారి ఆరోగ్యం కుదుటపడిందని డాక్టర్లు తెలియజేశారు.