
● ఆదుకోండయ్యా..!
జయపురం: అగ్ని ప్రమాదంలో గాయపడిన తన రెండేళ్ల కుమార్తె తనీస హికాకి చికిత్స కోసం దాతలు సహకరించాలని ఆ బాలిక తండ్రి మీనా హికాక కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కొరాపుట్ జిల్లా లమతాపుట్ సమితి ఒడియపెంట పంచాయతీ తొలకాయిపొదర్ గ్రామంలో ఈనె ల 5వ తేదీన మీనా హికాక ఇంటి సమీపంలోని కాలువలో పిల్లలు స్నానం చేశారు. అనంతరం చలిగా ఉందని మంట వేసుకొని చలి కాగుతున్నారు. ఆ సమయం అకస్మాత్తుగా తనీసకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు స్పందించి వెంటనే మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే తనీస శరీరం బాగా కాలిపోయింది. వెంటనే తల్లిదండులు బాలికను లమతాపుట్ కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కట ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం కొరాపుట్ సాహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే 8 రో జుల పాటు అక్కడ చికిత్స అందించినా బాలిక పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బరంపురం గానీ కటక్ గానీ తీసుకెళ్లమని డాక్టర్లు సూచించారు. కానీ డబ్బులు లేకపోవడంతో తమ కుమార్తెను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇంటి వద్దనే ఉంచారు. తాను చిన్న రైతునని, ఐదుగురు పిల్లలతో కష్టం మీద జీవనం సాగిస్తున్నానని తండ్రి వాపోతున్నారు. దాతలు సహకరించి తమ కుమార్తెను కాపాలని కోరుతున్నారు.