సెలవు రోజు తనిఖీలకు రావడమేంటి..? | - | Sakshi
Sakshi News home page

సెలవు రోజు తనిఖీలకు రావడమేంటి..?

Aug 16 2025 8:24 AM | Updated on Aug 16 2025 8:28 AM

అధికారులను అడ్డుకున్న హాస్టల్‌ వార్డెన్‌

పాతపట్నం: స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లా పక్కనున్న ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశాల మేరకు తనిఖీ చేసేందుకు మండల అధికారులు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. అయితే హాస్టల్‌ గేటుకు వేసిన తాళం తీయకుండా వార్డెన్‌ బి.శ్యామల అధికారులైన తహసీల్దార్‌ ఎన్‌.ప్రసాదరావు, ఎంపీడీవో పి.చంద్రకుమారి, ఏఎస్‌డబ్ల్యూవో ఎం.శ్యామలను బయటనే ఉంచారు. సెలవు రోజుల్లో హాస్టల్‌కు రావడమేంటని ఎదురు ప్రశ్నలు వేశారు. దీంతో వెంటనే తహసీల్దార్‌ ప్రసాదరావు ఎస్‌ఐ బి.లావణ్యకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్‌ఐ తన సిబ్బందితో హాస్టల్‌కు చేరుకుని తాళం తీయించారు.

వార్డెన్‌ వేధిస్తున్నారు

ఈ హాస్టల్‌లో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న మొత్తం 44 మంది విద్యార్థినులు ఉన్నారు. దీంతో వీరి వద్దకు అధికారులు వెళ్లి మాట్లాడారు. అయితే వార్డెన్‌ తమను వేధిస్తోందని విద్యార్థినులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తరుచూ కొడుతోందని, సక్రమంగా భోజనం పెట్టడం లేదని వాపోయారు. ఏమైనా ప్రశ్నిస్తే తమ తల్లిదండ్రులకు తమపై లేనిపోని చాడీలు చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వారానికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే హాస్టల్‌కు వస్తుందని పేర్కొన్నారు. వచ్చిన రోజుల్లో వేధిస్తుందని తెలిపారు. మెనూ సక్రమంగా పెట్టడం లేదని, పెట్టిందే తినాలని చెబుతుందని ఆరోపించారు. కాగా కలెక్టర్‌కు సాంఘిక సంక్షేమ జిల్లా అధికారులు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు తనిఖీ చేయడానికి వచ్చామని తహసీల్దార్‌ తెలిపారు. విద్యార్థుల సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

సెలవు రోజు తనిఖీలకు రావడమేంటి..? 1
1/1

సెలవు రోజు తనిఖీలకు రావడమేంటి..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement