
మట్టి చరియలు పడి బాలుని మృతి
రాయగడ: నాగావళి నదిలో స్నానం చేస్తున్న సమయంలో పై నుంచి మట్టి చరియలు జారి పడడంతో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి పొలమ పంచాయతీ పరిధిలోని పొంగాలి గ్రామంలో శుక్రవారం ఈ విషాదం జరిగింది. మృతుడు అదే గ్రామానికి చెందిన శంకరరావు హికక కొడుకు ధర్మ హికకగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కల్యాణ సింగుపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంద్రాగస్టు వేడుకలను తిలకించేందుకు పొంగాలి గ్రామానికి చెందిన నలుగురు బాలురు గ్రామంలో గల పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తూ.. గ్రామానికి సమీపంలో గల నాగావళి నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ధర్మ అనే బాలుడు స్నానం చేసి వస్తున్న సమయంలో నది ఒడ్డున గల మట్టి చరియలు అతనిపై పడటంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. విషయాన్ని తోటి బాలురు గ్రామస్తులకు తెలియజేయడంతో అంతా అక్కడికి వెళ్లి మట్టి చరియలని తొలగించారు. అయితే అప్పటికే ధర్మ మృతి చెందినట్లు గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.