
నిశ్చలానందను కలిసిన మోహన్ భగవత్
భువనేశ్వర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రముఖుడు మోహన్ భగవత్ రాష్ట్ర పర్యటనలో భాగంగా పూరీ గోవర్దన పీఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతితో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరివురి మధ్య వివిధ మతపరమైన అంశాలపై చర్చ సాగినట్లు తెలిపారు.
11 జిల్లాలకు అదనంగా
5 కిలోల బియ్యం
భువనేశ్వర్: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని గరీబ్ కల్యాణ్ అన్న యోజన రేషను కింద అదనంగా 5 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు. 3 నెలల పాటు నిరవధికంగా ఈ బియ్యం పంపిణీ చేస్తారు. 11 జిల్లాలకు ఈ సౌలభ్యం పరిమితంగా పేర్కొన్నారు. బౌధ్, గజపతి, కంధమల్ జిల్లాలతో పాటు 8 కేబీకే జిల్లాలు ఈ సౌకర్యాన్ని పొందుతాయి. 27 లక్షలకు పైగా కుటుంబాలు 3 నెలల పాటు ఈ లబ్ధి పొందుతాయి. సమగ్రంగా 41 వేల 82 మెట్రిక్ టన్నుల అదనపు బియ్యం పంపిణీ చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి దాదాపు రూ.180 కోట్లు ఖర్చు చేస్తుంది.
యువకుడిపై దాడి
రాయగడ: స్థానిక ఎఫ్‌సీఐ కూడలి సమీపంలో ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం చేసుకుని జీవనోపాధి పొందుతున్న ఒక యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలితో దాడిచేసి గాయపరిచాడు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి స్థానికంగా నివసిస్తున్న ప్రమోద్ అగ్రవాల్‌గా గుర్తించారు. ఈ మేరకు తనపై దాడి జరిగిందని బాధితుడు సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో అగ్రవాల్ ఎప్పటిలాగే ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం కోసం తన దుకాణం తెరిచి, సామాన్లు సర్దుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చి ఒక వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ క్రమంలో దాడి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో యువకుడి చేతులకు గాయాలయ్యాయి. దాడి చేసిన అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఇదివరకు తన దుకాణానికి ఆ వ్యక్తి వచ్చి తనతో పలుమార్లు గొడవ పడుతుండేవాడని, దీనిపై తాను ఇదివరకు ఒకసారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని వెల్లడించారు. అదే కక్షతో తనపై దాడి చేసి ఉంటాడని బాధితుడు అగ్రవాల్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే తనపై దాడి చేసిన వ్యక్తి వివరాలు తనకు తెలియదని వివరించాడు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం అగ్రవాల్ ఇంటికి వెళ్లిపోయాడు.
బాలికలపై లైంగిక దాడి
● ఇద్దరు నిందితులు అరెస్టు
జయపురం: బాలికలను వివాహం చేసుకుంటామని నమ్మించి అత్యాచారం చేసిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సదర్ పోలీసు అధికారి ఆశ్రిత ఖల్కే వెల్లడించారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు బొరిగుమ్మ పోలీసుస్టేషన్ పరిధి జయంతిగిరి గ్రామానికి చెందిన కార్తీక పొరజ, మరొకరు జయపురంలోని చెందిన బైరాగి మఠానికి చెందిన ఉద్వభొ ఖిలోగా తెలియజేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జయంతిగిరికి చెందిన కార్తీక పొరజ అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను వివాహం చేసుకుంటానని నమ్మంచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటనపై గ్రామ పెద్దలు చర్చించి పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అయితే సమస్య పరిష్కారమవ్వకపోవడంతో పాటు కార్తీక పొరజ కుటుంబ సభ్యులు భయపెట్టడంతో బాలిక, ఆమె తల్లిదండ్రులు జయపురం మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు కార్తీక పొరజను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అటువంటి సంఘటనే జయపురం సదర్ పోలీసుస్టేషన్ బైరాగిమఠం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉద్వభొ ఖిలో అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించాడు. ఇప్పుడు అతడు మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిన మైనర్ బాలిక నిలదీసింది. దీంతో అతడు భయపెట్టాలని చూడడంతో జయపురం మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్లు ఆశ్రిత ఖల్కే వెల్లడించారు.