భామిని: పూల సాగులో కనకాంబరాలది ఓ ప్రత్యేకత. గ్రామీణ ప్రాంతాల్లో వాడంబారాలుగా పిలవబడే వీటిని కనకాంబరాలగానే పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తారు. ఏడాది పొడవునా పూలు పూస్తూ సాగుదారులకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెడతాయి. వీటిని ఒకసారి నాటితే మూడేళ్ల వరకు దిగుబడినిచ్చి సాగుదారులకు పుష్కలంగా ఆదాయాన్ని అందిస్తాయి. ఈ పూలు వాసన లేకున్నా వివిధ రంగుల్లో మహిళలను ఆకర్షిస్తాయి. అదే సమయంలో వివిధ శుభకార్యాల్లో వీటికున్న ప్రత్యేకత వేరు. వీటిని సీ్త్రల శిరోజాల అలంకరణతో పాటు శుభ కార్యాల్లో వేర్వేరు రూపాల్లో అలంకరించి ఆదాయాన్ని పొందుతారు. ఇవి ఎక్కువగా ఆరంజ్, ఎల్లో, ఎరుపు రంగుల్లో పూస్తాయి. మార్కెట్‌లో ఈ రకాలకు మంచి డిమాండ్ ఉండడంతో పాటు గిట్టుబాటు ధరలు వస్తుండడంతో రైతులు వీటి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. కొబ్బరి, మామిడి తోటల్లో అంతర పంటలుగా కూడా వీటిని సాగు చేయవచ్చని చెబుతున్నారు. పాలకొండ నియోజకవర్గంలో భామిని, వీరఘట్టం, పాలకొండ మండలాల్లో వీటి సాగు ఎక్కువగా ఉంది. స్థానికంగా వీటిని విక్రయించడంతో పాటు దూర ప్రాంతాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. పాతపట్నం, టెక్కలి, ఒడిశాలోని పర్లాకిమిడి, గుణుపూర్ ప్రాంతాలకు రోజూ రవాణా చేస్తున్నారు. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
ఈ సీజన్‌లోనే...
ప్రస్తుతం కనకాంబరాలు నాటుకొనే సమయంగా రైతులు చెబుతున్నారు. ఏటా జూలై – ఆగస్టు నెలల్లో కొత్తగా తోటలు నాటుకుంటారు. రెండు నెలలుగా నారు పోసి సంరక్షించుకుని ఆ నారును మెట్టు భూముల్లో వేస్తారు. నాణ్యమైన నారు కోసం రామభద్రపురం, సాలూరు, రాజమండ్రి నర్సరీల నుంచి దీన్ని తెస్తున్నారు. అధిక తేమ, వేడి కలిగిన నేలల్లో సాగుకు ఇది అనుకూలం. చల్లని వాతావరణ పరిస్థితుల్లో అధిక దిగుబడినిస్తాయి. నీరు నిలువ లేని అన్ని రకాల నేలలు వీటి సాగుకు అనుకూలం.
విత్తన తయారీ..
విత్తనం, కాండపు మొక్కల ద్వారా ప్రవర్ధనం చేసుకోవచ్చు. అధిక దిగుబడినిచ్చే రకాలను విత్తనాల ద్వారా తయారు చేస్తారు. ఎకరానికి రెండు కిలోల విత్తనం అవసరం. నిల్వ చేసిన విత్తనం మొలకెత్తే శాతం తక్కువ. అప్పుడే పూల గుత్తిల నుంచి వేరు చేసిన విత్తనాలను సిద్ధం చేసుకోవచ్చు. ఒక మీటరు పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు గల నారుమడులు సిద్ధం చేసి నారు వేసుకోవాలి. మొక్కలు 4 నుంచి 6 ఆకులు వేసిన 50 నుంచి 60 రోజుల్లో నారును తీసి నాటుకోవచ్చు. నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. అయినా అవసరాన్ని బట్టి 10 నుంచి 15 రోజులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారానికి ఒకసారి అందించాలి. డ్రిప్ పద్ధతిలో అయితే 4 లేదా 5 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి.
సాగుపై పెరుగుతున్న ఆసక్తి