
భవనం పైనుంచి జారి పడి వ్యక్తి మృతి
మెంటాడ: మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనం పిట్టగోడ నిర్మాణంలో పని చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ జారిపడి తీవ్రంగా గాయపడి అనంతరం మృతి చెందాడు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ కె.సీతారాం శనివారం అందించిన వివరాలు.. మెంటాడ మండల కేంద్రంలో నిర్మితమవుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించి పిట్టగోడ నిర్మాణం జరిగే సమయంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాకకు చెందిన గురజాపు అప్పారావు(32) ప్రమాదవశాత్తూ జారి పడి గాయపడినట్టు ఎస్‌ఐ తెలిపారు. చికిత్స నిమిత్తం గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరంలోని సర్వజన ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
సీతానగరం: మండలంలోని బూర్జ గ్రామానికి చెందిన ఆయకట్టు సంఘం చైర్మన్ ఈదిబిల్లి బలరాంనాయుడు వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురై మూడు రోజుల కింద పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం విజయనగరం ఎంఆర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బలరాంనాయుడు(62) మృతి చెందినట్టు పోలీసులు శనివారం తెలిపారు. మృతుడి భార్య ఈదుబిల్లి అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు ఎస్‌ఐ ఎం.రాజేష్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
భోగాపురం: వీరాస్వామి అనే లారీ డ్రైవర్ విజయవాడ నుంచి వస్తూ సుందరపేట హైవే జంక్షన్ వద్ద యూ టర్న్ తీసుకుని భోగాపురం అన్నపూర్ణ హోటల్ సమీపంలో శనివారం లారీని కాసేపు ఆపాడు. తరువాత లారీ కింద మృతి చెంది కనిపించాడు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న కుంభ జోవేష్ అనే వేరే లారీ డ్రైవర్ వీరాస్వామి మృతి చెందినట్టు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సీఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి డ్రైవర్ వీరాస్వామి గుండెపోటుతో మరణించాడా? వేరే ఏవిధంగానైన మరణించాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
విజయనగరం క్రైమ్ : అలమండ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం జీఆర్‌పీ పోలీసులు శనివారం గుర్తించారు. 50 సంవత్సరాల వయసు ఉండే ఈ వ్యక్తి తెలుపు రంగు కట్ బనియన్, ఖాకీ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని, రైలు నుంచి జారి పడి ఉండొచ్చని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో జారి పడడంతో తలకు తీవ్ర గాయాలై ఉండొచ్చని జీఆర్‌పీ ఎస్‌ఐ బాలాజీరావు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన వారు 9490617089, 830990038, 9491813163 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
వ్యక్తి ఆత్మహత్య
దత్తిరాజేరు: మండలంలోని దాసరిపేట గోపినాధ పట్నాయక్ చెరువు గట్టుపై మెంటాడ మండలం మీసాలపేట గ్రామానికి చెందిన మహంతి రామునాయడు(55) ఉరి వేసుకొని మృతి చెందినట్టు పెదమానాపురం ఎస్‌ఐ జయంతి శనివారం తెలిపారు. పొలం పనులకు వెళ్తానని ఇంటి వద్ద చెప్పి దాసరిపేట చెరువు గట్టుపై మృతి చెందడంతో బంధువుల ద్వారా సమాచారం తెలియడంతో కుటుంబంలో ఒక్కసారి విషాదం నెలకొంది. భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. మృతుడికి వివాహం అయిన కుమార్తెతో పాటు కుమారుడు, మరో కుమార్తె ఉన్నారు.

భవనం పైనుంచి జారి పడి వ్యక్తి మృతి

భవనం పైనుంచి జారి పడి వ్యక్తి మృతి

భవనం పైనుంచి జారి పడి వ్యక్తి మృతి