
వృత్తి వదల్లేరు.. బతుకు చక్రం కదలట్లేదు..!
● వినాయక విగ్రహాలకు డిమాండ్ తగ్గడంతో కుమ్మరుల్లో ఆందోళన
● బతుకు భారమైందంటూ ఆవేదన
● ఆదుకోని కూటమి ప్రభుత్వం
సాలూరు: మరో పది రోజుల్లో వినాయకచవితి పండగ రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే కుమ్మరి వీధులన్నీ సాధారణంగా వినాయక విగ్రహాల తయారీతో హడావిడిగా ఉండాలి. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి కుమ్మరి వీధుల్లో కనిపించడం లేదు. రథయాత్ర తరువాత ప్రారంభించే ఈ విగ్రహాల తయారీకి రెండు నెలల ముందు నుంచే సాలూరు, ఒడిశా పరిసర ప్రాంతాల నుంచి వినాయక కమిటీ నిర్వాహకులు వచ్చి భారీ పరిమాణంలో, వివిధ ఆకృతుల్లో వినాయక ప్రతిమల తయారీకి ఆర్డర్‌లు ఇచ్చేవారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదని కుమ్మరులు వాపోతున్నారు. పెద్దబొమ్మలు ఆర్డర్‌లు చాలా వరకు తగ్గాయని, ఆ భయంతో గతంతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే బొమ్మలను తయారు చేస్తున్నట్టు తయారీదారులు తెలిపారు.
సాలూరు, పాచిపెంట పండగల ఎఫెక్ట్
ప్రతి ఏడాది వినాయక ఉత్సవాన్ని చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఐక్యంగా స్థాయి కొద్దీ మండపాలు ఏర్పాటు చేసుకుని ఘనంగా పూజలు, అన్న సమారాధనలు, అనుపోత్సవం చేస్తుంటారు. ఈ ఏడాది సాలూరు, పాచిపెంట గ్రామదేవతల పండగలు జరగడంతో ప్రజల వద్ద చాలా వరకు డబ్బుల్లేవని దీనితో ఈ ఏడాది వినాయక ప్రతిమల ఆర్డర్‌లు తగ్గాయని కుమ్మరులు చెబుతున్నారు. వినాయకుడిని పెట్టిన తరువాత అన్న సమారాధన, అనుపోత్సవాలకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల వద్ద డబ్బులు లేకపోవడంతో నిర్వాహకులు కొంత వెనుకంజ వేస్తున్నారని వారు పేర్కొంటున్నారు.
పెరిగిన తయారీ ఖర్చు
బొబ్బిలి నుంచి తీసుకువచ్చే ట్రాక్టర్ మట్టికి కుమ్మరులు సుమారు 3500 రుపాయిలు చెల్లిస్తున్నారు. తయారీలో భాగంగా ముడి సరుకులు, రంగులకు అధిక డబ్బులు ఖర్చవుతున్నాయి. ఇంత డబ్బులతో తయారు చేస్తున్న వినాయక విగ్రహాలు కొనుగోలు జరగకపోతే ఇబ్బందులు పడతామని కావున గతంతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే ఈ ఏడాది వినాయక విగ్రహాలు తయారీచేస్తున్నామని కుమ్మరులు చెబుతున్నారు. రూ.లక్షలు పెట్టి తీసుకువచ్చిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన పెద్ద విగ్రహాలకు ఇంకా ఆర్డర్లు రాకపోవడంతో ఆందోళన నెలకొందని తయారీదారులు వాపోతున్నారు.
కుమ్మరి చక్రం కదలనంటున్నా....
కుమ్మరి వృత్తి తమ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయమని వారు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ వృత్తి తమ కడుపు నింపేదని, నేడు ఆ పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి పాత్రల వినియోగం తగ్గిపోవడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని చెబుతున్నారు. ఒకప్పుడు ఈ వృత్తే జీవనాధారంగా ఉండేదని, ప్రస్తుతం ఏడాదిలో రెండు నెలలు మాత్రమే ఈ వృత్తి కడుపు నింపుతోందని వారు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా కుమ్మరి చక్రం కదలనంటున్నా.. తమ కుల వృత్తిని వదులుకోలేకపోతున్నామని, ప్రభుత్వం తమకు చేదోడువాదోడుగా నిలవాలని వారు కోరుతున్నారు.
పంటల్లేవు.. పథకాల్లేవు..
ప్రజలకు గత ప్రభుత్వంలో ప్రతి నెలా ఏదో ఒక పథకం కింద డబ్బులు వారి ఖాతాల్లో జమవ్వడంతో ఆ డబ్బులు వారికి ఇటువంటి పండగలు, ప్రత్యేక కార్యక్రమాలకు ఉపయోగపడేవి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పథకాలు లేక ప్రజల వద్ద డబ్బులు కొరత నెలకొందని చర్చించుకుంటున్నారు. మరోవైపు పంటల పరిస్థితులు కూడా అనుకున్నంత సానుకూలంగా ఏమీ లేకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో పండగ వైపు పెద్దగా దృష్టి సారించడం లేదు.

వృత్తి వదల్లేరు.. బతుకు చక్రం కదలట్లేదు..!