
ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం
● మంత్రి గోకులానంద మల్లిక్
రాయగడ: రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గోకులానంద మల్లిక్ అన్నారు. స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుగా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ఖనిజ, ప్రాకృతిక సంపదలను సద్వినియోగపరచాలన్నారు. దాదాపు 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీలకు ఆశాదీపం
స్థానిక రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్ట్‌లో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంతోమంది నిరుపేదలైన అనాథ, ఆదివాసీ యువతులకు ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తూ ట్రస్టు ఆశాదీపంగా మారిందని పేర్కొన్నారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు.