
ముగ్గురు వలస కార్మికుల దుర్మరణం
● తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం ● బాధితులకు న్యాయం చేయాలని నబరంగ్‌పూర్ జిల్లాలో ప్రతిపక్షాల ఆందోళన
కొరాపుట్ : తెలంగాణా రాష్ట్రంలో ఒడిశాకు చెందిన ముగ్గురు వలస కార్మికులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటనలో మృతులకు న్యాయం చేయాలంటూ బుధవారం నబరంగ్‌పూర్ జిల్లా జొరిగాం సమితి కొకడాబెడా గ్రామంలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. మంగళవారం తెలంగాణా రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కిసార పోలీస్ స్టేషన్ పరిధిలో సికిందర్ ఖమ్మం ప్రాంతంలో రోడ్డుపక్కన పంట భూమిలో వలస కార్మికులు మొక్కలు నాటుతున్నారు. ఈ సమయంలో వ్యాన్ దూసుకెళ్లడంతో కొకడాబెడా గ్రామానికి చెందిన జయరాం బోత్ర (56), నారాయణ బోత్ర (20), శేష్మన్ బోత్ర (21)లు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలను తెలంగాణా ప్రభుత్వం నబరంగ్‌పూర్ జిల్లాకు బుధవారం పంపించింది. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఒడిశా రాష్ట్రంలో మైదాన ప్రాంతాలలో కార్మికులు మృతి చెందితే ప్రభుత్వం తక్షణ పరిహారం ప్రకటిస్తుందని గుర్తు చేశారు. వీరికి కూడా ఒడిశా ప్రభుత్వం పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జాతీయ రహదారిపై బీజేడీకి చెందిన మాజీ ఎంపీ రమేష్ చంద్ర మజ్జి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భుజబల్ మజ్జి, కెమరాజ్ బాగ్, హరావతి గొండో తదితరులు బైఠాయించి నిరసన తెలియజేశారు. మరోవైపు ఉమ్మర్‌కోట్ డివిజన్ నుంచి ఉపాధి కోసం తెలంగాణా వెళ్తున్న వారు వరుస ఘటనలో మృత్యువాత పడుతున్నారు. ఇటీవల రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో జిల్లాకు చెందిన ముగ్గురు కార్మికులు మృతి చెందారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో మరో ముగ్గురు దుర్మరణం చెందడంతో కార్మికుల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాకు చెందిన సుమారు 50 వేల మంది వలస కార్మికులు ఇతర రాష్ట్రాలలో పని చేస్తున్నట్లు అంచనా. అందులో అత్యధికులు తెలంగాణా రాష్ట్రంలోనే పని చేస్తున్నారు.

ముగ్గురు వలస కార్మికుల దుర్మరణం

ముగ్గురు వలస కార్మికుల దుర్మరణం

ముగ్గురు వలస కార్మికుల దుర్మరణం

ముగ్గురు వలస కార్మికుల దుర్మరణం