
విజిలెన్స్ వలలో సీహెచ్‌సీ ఆరోగ్య కార్యకర్త
రాయగడ: జిల్లాలోని మునిగుడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న కుంజో బిహారి రౌత్ విజిలెన్స్ వలలో చిక్కుకున్నారు. సీహెచ్‌సీలో జన్మధృవపత్రం మంజూరు చేయడంలో భాగంగా ఒకరి నుంచి మూడు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా కొరాపుట్ విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు రౌతుకు సంబంధించి మునిగుడకు వెళ్లే రహదారిలోని డుకుం గ్రామంలో ఉన్న ఇళ్లల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సీహెచ్‌సీలో బర్ట్ సర్టిఫికెట్ పొందాలంటే అందుకు ఆరు వేల రుపాయల లంచాన్ని రౌత్ ఒక రైతు వద్ద డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా మొదట మూడు వేల రూపాయలను కొద్దిరోజుల క్రితం ఆరోగ్య కార్యకర్తకు రైతు చెల్లించాడు. మిగతా మూడు వేల రూపాయలు చెల్లిస్తేగాని ధృవపత్రం ఇచ్చేదిలేదని మొండికేసి చెప్పడంతో బాధితుడు గత్యంతరం లేక విజిలెన్స్ అధికారులను ఆశ్రయించాడు. వారి సలహా మేరకు బుధవారం మూడు వేల రూపాయలను ఆరోగ్య కార్యకర్త కుంజొ బిహారి రౌత్‌కు అందజేస్తుండగా విజిలెన్స్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.