మరణ మృదంగం | - | Sakshi
Sakshi News home page

మరణ మృదంగం

Jun 5 2025 10:47 AM | Updated on Jun 5 2025 2:00 PM

College Superintendent

మాట్లాడుతున్న కళాశాల సూపరింటెండెంట్ సుశాంత్

కొరాపుట్‌ వైద్య కళాశాల ఆస్పత్రిలో దారుణం 

మంగళవారం అర్ధరాత్రి ఆరుగురు రోగులు మృత్యువాత 

వైద్య వికటించడం వల్లేనంటున్న బాధిత కుటుంబాలు 

అవన్నీ సహజ మరణాలే: ప్రభుత్వం

కొరాపుట్‌: కొరాపుట్‌ జిల్లా కేంద్రంలోని సాహిద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 11 నుంచి బుధవారం వేకువజాము వరకు ఆరుగురు రోగులు మృత్యువాతపడ్డారు. వైద్యం వికటించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని బాధిత కుటుంబాలు ఆరోపణలు చేస్తుండగా.. అవన్నీ సహజ మరణాలు అయి ఉండవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషాద ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. మృతుల్లో నలుగురు ఐసీయూలో ప్రాణాలు వదలడం వివాదాస్పదంగా మారింది. మృతుల్లో భగవాన్‌ పరజా (68), శుక్ర మజ్జి (45), జగన్నాథ్‌ పూజారి (54), రుకుని పెంటియా (47), బాటి ఖురా(36), పుల్మతి మజ్జి (29)లుగా ప్రభుత్వం ప్రకటించింది. వీరందరూ అత్యవసర చికిత్స కోసం వచ్చారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు.

దర్యాప్తుకు ఆదేశం..

విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకులు రుపక్‌ తురుక్‌, మాజీ ఎమ్మెల్యే నిమయ్‌ సర్కార్‌ తదితరులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే పోలీసు బలగాలను మోహరించారు. కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ వీ.కీర్తివాసన్‌ కళాశాలకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరణాలపై పూర్తిస్థాయి విచారణ చేస్తామన్నారు. ఇవి సహజ మరణాలుగానే అనుమానం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతుందన్నారు. తనకు వైద్య పరిజ్ఞానం లేదని, అందుకే ఇప్పుడే ఏం చెప్పలేనన్నారు. కళాశాల సూపరింటెండెంట్‌ సుశాంత్‌ మాట్లాడుతూ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు.10 మంది వైద్య నిపుణులతో ప్రత్యేక కమిటీతో దర్యాప్తు చేస్తామన్నారు. మరోవైపు రోగుల బంధువులు మీడియాతో మాట్లాడుతూ ముగ్గురు నర్సులు వచ్చి ఇంజక్షన్లు చేశారని, ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఐదు నిమిషాలకు ఒక్కొక్కరూ మృతి చెందారని చెప్పారు. కాగా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం కింద రూ.10 వేలు చొప్పున అందజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement