గుర్తు తెలియని మృతదేహం లభ్యం
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని సింగుపురం గ్రామ సమీప కొండమ్మ కాలనీకి ఆనుకుని వెళ్లే జాతీయ రహదారి ప్రదేశంలో 65 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని శ్రీకాకుళం రూరల్ పోలీసులు సోమ వారం గుర్తించారు. మధ్యాహ్నం నుంచి అచేతన స్థితిలో పడి ఉండడాన్ని కొంతమంది చూసినట్లు తెలిపారు. ఎవరో మద్యం మత్తులో ఉన్నారు అనుకొని ఎవరూ పట్టించుకోలేదు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఏఎస్‌ఐ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని రిమ్స్‌కి తరలించారు. బంధువులు ఎవరైనా గుర్తిస్తే శ్రీకాకుళం రూరల్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.


