నబరంగ్‌పూర్ మున్సిపాలిటీలో అవినీతి
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనుల్లో అవినీతి చోటుచేసుకుందని బీజేడీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ ప్రదిప్ మజ్జి ఆరోపించారు. శుక్ర వారం జిల్లా కేంద్రంలో గ్లేజ్ హోటల్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్య పేరిట కోట్లాది రూపాయలు కొట్టేశారన్నారు. ఆర్‌టీవో ఆఫీస్ వద్ద డంపింగ్ యార్డ్ కోసం గోతులు తీయడానికి రు.26 లక్షలు ఖర్చు చేసినట్లు నిధులు డ్రా చేశారన్నారు. అసలు అక్కడ గోతులు తీయలేదని, తీసిన గోతులు ఎక్కడ ఉన్నాయని,వెలికి వచ్చిన మట్టి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. 1300 గుంటలు జేసీబీతో పని చేసినట్లు రికార్డులు పుట్టించారన్నారు. అలా చేస్తే నాలుగు పెద్ద చెరువులు తయారు చేయవచ్చనన్నారు. గత ఆరు నెలలుగా డంపింగ్ యార్డ్‌లో పని చేసిన వారికి రూ. 13 లక్షలు వేతనాలు చెల్లించినట్లు చూపించారన్నారు. కానీ ఇదే పనికి నాలుగు ఎస్‌హెచ్‌జీలకు మరో రూ. 13 లక్షలు చెల్లించినట్లు నిధులు డ్రా చేశారన్నారు. ఒకే పనికి రెండు చెల్లింపులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. వీధులను చీపురుతో ఊడ్చడానికి నెలకు రూ..13 లక్షలు వేతనాలు 135 మందికి ఇస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. కానీ అంత మంది పని వాళ్లుని వినియోగించడం లేదన్నారు. కమర్షియల్ ప్రాంతాలలో సాయంత్రం శుభ్ర పరుస్తున్నట్లు వేతనాలు డ్రా చేశారన్నారు. కానీ తనకు తెలిసి ఏనాడు నబరంగ్‌పూర్ పట్టణంలో సాయంత్రం శుభ్రపరిచినట్లు ఆధారాలు లేవన్నారు. ప్రతి నెల కాలువల క్లినింగ్ కోసం రూ. 5 లక్షలు వాడుకున్నారన్నారు. కానీ ప్రముఖులు ఉండే వీధులలో మాత్రమే కాలువలను శుభ్ర పరుస్తున్నారు తప్పితే మిగిలిన ప్రాంతాల్లో లేదన్నారు. శుభ అభినందన్ పక్కన రూ. 42 లక్షలతో రోడ్డు నిర్మించారన్నారు. కానీ ఈ రోడ్డు నివాసాలు లేని చోట జీడి తోట పక్కన నిర్మాణం జరిగిందన్నారు. తనకు అర్థం కానీ విషయం ఏమిటంటే చదువుకున్న ఇంజినీర్లు ఎలా అక్కడ రోడ్డు నిర్మించారో చెప్పాలన్నారు. అసలు ఆ రోడ్డు మీద ఆధార పడే ఒక్క నివాసం కూడా అక్కడ లేదన్నారు. ఇదే పరిస్థితి ఉత్కళ కాలేజీ వద్ద రు. కోట్లాది రూపాయల వ్యయంతో పొలాల మధ్య రోడ్డు నిర్మించారని, ఇంకా కాలువలు కూడా నిర్మాణం చేస్తారన్నారు. ఒక్క నివాసం లేని చోట కోట్లాది రూపాయలు వృథా చేశారని ఆరోపించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సౌమ్య మహాపాత్రో మాట్లాడుతూ.. తాను వైస్ చైర్మన్ అయినప్పటికీ తనకు తెలియకుండా చైర్మన్, దళారులు, అధికారులు నిర్ణయాలు చేస్తున్నారన్నారు. అవినీతిపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమావేశంలో బీజేడీ నాయకులు తపస్ త్రిపాఠి, భీమె హరిజన్, ప్రమెధ్ త్రిపాఠి, సరోజ్ పాత్రో పాల్గొన్నారు.
మాజీ ఎంపీ ప్రదిఫ్ మజ్జి ఆరోపణ
నబరంగ్‌పూర్ మున్సిపాలిటీలో అవినీతి


