రథయాత్ర కార్యక్రమాలు ఖరారు
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని వార్షిక రథయాత్ర ప్రణాళిక ఖరారైంది. పూరీ గజపతి మహా రాజా దివ్య సింఘ దేవ్ అధ్యక్షతన సోమవారం జరిగిన శ్రీమందిర్ పాలక మండలి సమావేశంలో ఈ ఏడాది జరగనున్న రథయాత్ర ప్రతిపాదిత కార్యక్రమాలు ఆమోదం పొందాయి. రథ యాత్రలో భాగంగా పరిగణించే స్నానోత్సవం మొదలుకొని నీలాద్రి విజే వరకు కొనసాగే పలు యాత్రలు, ఉత్సవాలు, ప్రత్యేక పూజాదుల కార్యక్రమాల్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు. రథ యాత్ర సందర్భంగా నిర్వహించాల్సిన ఛొత్తీషా నియోగుల సమావేశంలో ఖరారు చేసిన వివిధ ఆచార వ్యవహారాలతో కూడిన కార్యక్రమాలను పాలక మండలి ఆమోదించిందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జూన్ 27న రథ యాత్ర ఆ రోజు ఉదయం 6 గంటలకు మంగళ హారతితో యాత్ర కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఉదయం 9 గంటలకు రథ ప్రతిష్ట ముగియాలని నిర్ణయించారు. మూల విరాట్లను వరుస క్రమంలో రథాల పైకి సంప్రదాయ రీతులతో తరలించే పొహండి కార్యక్రమం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్తవుతుంది. రథాలపై మూల విరాటులు ఆసీనులైన తర్వాత గజపతి మహా రాజా 3 రథాలను ఊడ్చే సాంప్రదాయ ’ఛెరా పొంహరా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2.30 నుండి 3 గంటల మధ్య ముగించాలని నిర్ణయించారు. అనంతరం రథాలకు సారథుల్ని అమర్చి చారుమళ్లు తొలగించి సాయంత్రం 4 గంటల నుండి రథాలను లాగేందుకు కార్యక్రమం ఖరారు చేశారు. జూన్ 11న జరగనున్న దేవ స్నాన పూర్ణిమ ఆచారాల ప్రణాళికలను ఈ సమావేశంలో పాలక మండలి ఽఆమోదించింది. మూల విరాటుల ప్రసిద్ధ గజానన అలంకరణ (హత్తి బేషొ) సాయంత్రం 4.30 గంటలకు జరుగుతుంది. గుండిచా మందిరం నుంచి తిరుగు ప్రయాణాన్ని సూచిస్తూ, బహుడా యాత్ర సందర్భంగా, సాయంత్రం 4 గంటలకు రథం లాగడం ప్రారంభం కానుంది. ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారి సీఏఓ, పూరీ కలెక్టర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.


