సమ్మర్ క్రికెట్ కోచింగ్‌కు వేళాయె..●
● రేపటి నుంచి జిల్లాలో క్రికెట్ కోచింగ్ క్యాంప్‌లు మొదలు
శ్రీకాకుళం న్యూకాలనీ: సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపులకు రంగం సిద్ధమైంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సూచనల మేరకు జిల్లా క్రికెట్ సంఘం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 5వ తేదీ నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 31వ తేదీ వరకు జరిగే ఈ శిక్షణ శిబిరాల్లో క్రికెట్‌పై ఆసక్తి కలిగిన బాలబాలికలు ఎవరైనా హాజరుకావచ్చని జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.
5 కేంద్రాల్లో శిక్షణ..
జిల్లాలో శ్రీకాకుళం జిల్లా కేంద్రం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్)కళాశాలతోపాటు కళింగపట్నం, నరసన్నపేట, టెక్కలి, ఇచ్ఛాపురం సబ్‌సెంటర్లలో ఈ సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్‌లను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు ఉద యం 6 ఉదయం 8.30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి 6.30 వరకు సబ్ సెంటర్లలో నిష్ణాతులైన కోచ్‌లు శిక్షణ ను అందించనున్నారు. శిక్షణకు హాజరయ్యే చిన్నారులు, బాలబాలికలకు ఫిట్‌నెస్‌తోపాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తదితర విభాగాల్లో తర్ఫీదును అందిస్తారు. తల్లిదండ్రులు వారి పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలని సబ్‌సెంటర్ల కోచ్‌లకు అందజేయాలని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షులు పీవైఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ పేర్కొన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న క్రీడాకారులకు జూన్ ఒకటో తేదీన ఆయా సబ్‌సెంటర్లలో సర్టిఫికెట్లను అందజేయనున్నట్టు వారు వెల్లడించారు.


