
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం
కొరాపుట్ : జిల్లాలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై జిల్లా పరిషత్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవా రం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని స్కిల్ డెవలప్‌మెంట్ సమావేశ మందిరంలో జెడ్పీ ప్రెసిడెంట్ సస్మితా మెలక అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహీణిపతి మాట్లాడుతూ స్మార్ట్‌మీటర్లు పెట్టి ప్రజలను దోచుకుంటున్నారని, విద్యుత్ సమస్యలపై ప్రజల ఫిర్యాదులు పట్టించుకోవడం లేదన్నారు. వేసవిలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తాగునీటి సమస్యపై గ్రామాల్లో ప్రజలు తమను నిలదీస్తున్నారని వాపోయారు. సమావేశంలో కలెక్టర్ వీ.కీర్తివాసన్, ఎమ్మెల్యేలు పవిత్ర శాంత (లక్ష్మీపూర్), రఘురాం మచ్చో (కొరాపుట్), రుపుధర్ బోత్ర(కొట్‌పాడ్), జిల్లా పరిషత్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.