బీజేపీ పాలనలో చేసింది శూన్యం
● రాష్ట్ర మాజీ మంత్రి జగన్నాథ సరక
రాయగడ: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర బీజేపీ పాలనలొ ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర మాజీమంత్రి, బీజేడీపార్టీ జిల్లా అధ్యక్షుడు జగన్నాథ సరక విమర్శించారు. ఆ పార్టీ 29వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలొ శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రజలను మభ్యపెట్టి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఇదే చివరి అవకాశమన్నారు. ప్రజలు మరెప్పుడూ వారిని సమర్ధించరని వ్యాఖ్యానించారు. రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కార్యకర్తలు ఎటువంటి అధైర్యపడకుండా ముందుకు వెళ్లాలని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో బీజేడీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజల వద్దకు వెళ్లాలన్నారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏడాదిన్నర పాలన గురించి ఎండగట్టాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. బీజేడీ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్‌కు ఇప్పటికీ ప్రజల ఆదరణ ఉందని స్పెషల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎస్‌డీసీ) మాజీ చైర్మన్, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు అనసూయ మాఝి అన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న నవీన్ పట్నాయక్ ద్వారా ఆవిర్భావమైన బీజేడీ భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చెందుతోందన్నారు. కార్యకర్తలు సహనం కోల్పోకుండా వ్యవహరించి రానున్న ఎన్నికల్లో సైనికుల్లా పనిచేయాలని హితవు పలికారు. బీజేడీ సీనియర్ నాయకుడు జగదీష్ పాత్రో, కిశోర్ పండ, ఽజిల్లా పరిషత్ సభ్యులు ధవలేశ్వర్ నాయుడు ప్రసంగించారు.
బీజేపీ పాలనలో చేసింది శూన్యం


